14ఏళ్లు మంత్రిగా ఉండి రూపాయి అవినీతికి పాల్పడలేదు : Kadiyam Srihari

by Dishaweb |   ( Updated:2023-08-23 16:02:38.0  )
14ఏళ్లు మంత్రిగా ఉండి  రూపాయి అవినీతికి పాల్పడలేదు : Kadiyam Srihari
X

దిశ,వేలేరు, (స్టేషన్‌ఘన్‌‌పూర్): స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కడియం అభివృద్ధి చూపిస్తానని, తనకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. కడియం శ్రీహరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి ఘన్ పూర్ నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జనగామ జిల్లా నెల్లుట్ల క్రాస్ రోడ్డు నుండి ఘన్ పూర్ వరకు భారీ బైక్, ఆటో ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఘన్ పూర్ మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..14 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని, నేను మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి చేశాడు అని ఎవరైనా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరాడు.

తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు పరిచయం చేస్తానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ల సహకారం తీసుకుంటానని తెలిపారు. ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తానని తెలిపారు. స్వార్థం కోసమో, డబ్బు సంపాదించడం కోసమో రాజకీయాన్ని ఉపయోగించనని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పైన నాకు ఒక అభివృద్ధి ప్రణాళిక ఉందని ఎమ్మెల్యే గా గెలిచిన తెల్లవారి నుండే దానిని అమలు చేస్తానని అన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కడియం మార్క్ అభివృద్ధి చూపిస్తానని హమీ ఇచ్చారు.

నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, సీఎం కేసీఆర్ పైన ప్రజలలో విశ్వాసం ఉందని దానికి నిదర్శనమే ఈ భారీ ఎత్తున తరలివచ్చిన జనమే నిదర్శనమని అన్నారు. నిన్నటి వరకు వేరు , ఇప్పుడు వేరు నాకు అందరూ సమానమేనని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వెళ్లాను, కానీ అందుబాటులో లేకపోవడంతో కలువలేకపోయానని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజయ్య సహకారం చాలా అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, రానున్న ఎన్నికల్లో కడియం శ్రీహరిని లక్ష ఓట్ల మెజారిటీ తో గెలిపిస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed