రోజు విడిచి రోజు కురుస్తున్న వానలు.. రైతు కళ్లలో కన్నీరు

by sudharani |
రోజు విడిచి రోజు కురుస్తున్న వానలు.. రైతు కళ్లలో కన్నీరు
X

దిశ, మరిపెడ : చెడగొట్టు వానలతో రైతు బతుకు బజారున పడింది. యాసంగి పంటలపై ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గాలి, వాన కలిసి అన్నదాతను ఊపిరాడకుండా చేస్తున్నాయి. రైతు పరిస్థితి ములిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మారింది. డోర్నకల్ నియోజకవర్గంలోని సీరోల్, కురవి, మరిపెడ, చిన్నగూడూర్ మండలాల్లో పంట నష్టం ఎక్కువ మొత్తంలో జరుగగా దంతాలపల్లి, నరసింహులపేట, డోర్నకల్ మండలాల్లో పంట నష్టం కొంత తక్కువ జరిగినట్టు సమాచారం.

వారం రోజుల నుంచి రోజు విడిచి రోజు వడగళ్ల వర్షం కురుస్తుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విదర్భ పశ్చిమ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తున్నాయి. మరో 2రోజుల వరకు అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతు గుండె గుబెలుమటుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. తడిసిన వడ్లను ఆరబెట్టకపోతే మొలకలు వస్తాయేమోనని ఆందోళన నెలకొనగా, ఆర పెడితే వర్షం వస్తుందేమోనని పరిస్థితి మరోవైపు నెలకొన్నది.

వారం రోజుల నుంచి కొంతమంది రైతులు ధాన్యాన్ని వారి కల్లాల్లోనే ఎండబెట్టుకున్నారు. వడగండ్ల వానతో ఎండ పెట్టిన ధాన్యం ఒక్కసారిగా తడిసి ముద్దయ్యాయి. రైతులు కల్లాలు, ఐకేపీ సెంటర్లలో వర్షం నీరు నిలవకుండా ఉండడానికి చిన్న చిన్న కాలువలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బయటకు తోడేస్తున్నారు. ఐకేపీ సెంటర్లు ప్రారంభించిన కొన్నిచోట్ల ప్రారంభానికి నోచుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల ప్రారంభించినా వడ్లు పోసుకునేందుకు వీలులేకుండా లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాచుకుచున్న దళారులు..

ప్రకృతి ప్రకోపం రైతులకు శాపంగా మారితే.. కొంతమందికి లాభంగా మారింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనించి పంట కోసిన వెంటనే పలువురు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇంకొంతమంది దళారులైతే ఐకేపీ సెంటర్ల పక్కనే లారీల్లో లోడ్ చేస్తూ వారం పది రోజుల వరకు వర్షాలు పడతాయంటూ మీ వడ్లు ఎవరూ కొనరు ఎంతోకొంతకు మాకు ఇవ్వండి అంటూ రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం. దళారులు సన్న, దొడ్డు రకాన్ని బట్టి క్వింటాళ్‌కు రూ.1400నుంచి రూ.1600లకు కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. అధికారులు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారులు స్పందించి దళారులను కట్టడి చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

టార్పాలిన్ కవర్లు ఇవ్వండి సారూ..!

వర్షాకాలంలో పండించిన పంటను వర్షం నుంచి కాపాడుకోవడానికి టార్పాలిన్ కవర్లు చాలా ముఖ్యం. కానీ ప్రభుత్వం ప్రతి రైతుకు టార్పాలిన్ కవర్లు ఇవ్వాలనే ఆలోచన చేయకపోవడం చాలా దురదృష్టకరమని పలువురు వాపోతున్నారు. వీటి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రతి రైతుకూ టార్ఫాలిన్ కవర్లు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సీజన్‌లో ధాన్యం ఆరబోయడానికి కల్లాల్లో ధాన్యం రాశులుగా పోయడానికి ఉపయోగించే తెల్ల పట్టాలకు రోజు వారీగా రూ.30 కిరాయి తీసుకుంటున్నారు. ఎకరానికి 6 పట్టాలు పడుతున్నాయని రోజుకు రూ.180చొప్పున కనీసం 10నుంచి 15 రోజులపాటు ఉంచాల్సి వస్తుందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం టార్పాలిన్ కవర్లు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.

తరుగుకు అడ్డుకట్టవేయాలి..

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొంతమంది దళారులు బస్తాకు రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు తరుగు తీస్తున్నట్టు సమాచారం. ఈ పద్ధతిని ప్రభుత్వం ఎప్పుడు ఉపేక్షించవద్దని, రైతుల పక్షాన ఆలోచించి తరుగు తీసే పద్ధతిని పూర్తిగా తొలగించాలని రైతులు కోరుతున్నారు. దీంతోపాటు హమాలీల ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

పంట నష్టంపై హామీలన్నీ హుళ్లక్కే..

మార్చి నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన జిల్లాల్లో కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి రూ.10వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు రూపాయ కూడా పడలేదని పంట నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో మంగళవారం రివ్యూలో తడిసిన వడ్లను కూడా మద్దతు ధరకే కొంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో అమలవుతోందో లేదోనని అనుమానం వ్యక్తం అవుతోంది.

కిరాయిలే ఎక్కవవుతున్నయ్...

నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల వరి పంటను కోయించాను. కొనుగోలు కేంద్రానికి తెస్తే కల్లాల్లో నీళ్లు నిలుస్తున్నాయి. వడ్లు తడవడం వల్ల మొలకలు వస్తున్నాయి. చేసేది లేక తెల్లవారుజామున వచ్చి రోడ్డుపైన ఒక పక్కకు ఆరబోసి మళ్లీ సాయంత్రంవేళలో ట్రాక్టర్ కిరాయి మాట్లాడుకొని ధాన్యాన్ని తీసుకెళ్తున్నా. రానుపోను కిరాయిలకే సరిపోతుంది. ఇంత చేసిన ఏమి లాభం లేకుండా పోతోంది.

- చెన్నబోయిన రవీందర్, రైతు, ఎల్లంపేట, మరిపెడ

అప్పు చేసి పెట్టుబడి పెట్టా..

నాకు సొంత భూమి లేదు. ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాను. పెట్టుబడి ఖర్చు కూడా చాలానే వచ్చింది. వాతావరణంలో మార్పుల వల్ల పంట నష్టపోయాను. అప్పు చేసి పెట్టిన పెట్టుబడి అలాగే మిగిలిపోయింది. నా పరిస్థితి ఎంటో అర్థం కావడం లేదు. కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి.

- గంగారాబోయిన నగేష్, యువ రైతు, చిన్నగూడూర్

Advertisement

Next Story

Most Viewed