కాళేశ్వరం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి

by Mahesh |
కాళేశ్వరం వద్ద వేగంగా పెరుగుతున్న గోదావరి
X

దిశ, కాటారం : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉధృతి పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని త్రివేణి సంగమం గోదావరి ప్రాణహిత నదుల కలయికతో సోమవారం రాత్రి వరకు వరద ఉధృతి క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. గోదావరి నదికి ఎగువన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కడియం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులడంతో వరద ఉధృతి పెరుగుతోంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాళేశ్వరలో వరద ఉధృతి ని పరిశీలించారు. అధికారులను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు నైనా ఎదుర్కోవాలని కలెక్టర్ ఆదేశించారు. అన్నారం లో సరస్వతి బ్యారేజ్ కు 6,21,729 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. 66 క్రస్ట్ గేట్లు ఎత్తివేసి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం లో పుష్కర ఘాట్ వద్ద రాత్రి 9 గంటల సమాచారం ప్రకారం 103.19 మీటర్ల వద్ద కు వరద ఉధృతి ఉంది. 103.50 మీటర్లకు వరద ప్రవాహం చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. సోమవారం రాత్రి మొదటి హెచ్చరికలు జారీ చేస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు లో సాయంత్రం 6 గంటల సమాచారం మేరకు 6,79,900 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 85 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed