పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.. మాజీ సర్పంచుల వినతి..

by Sumithra |   ( Updated:2024-09-26 11:04:18.0  )
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.. మాజీ సర్పంచుల వినతి..
X

దిశ, దుగ్గొండి : అభివృద్ధి పనులు పూర్తి చేసి పెండింగ్ లో ఉన్న రూ.6కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని దుగ్గొండి మండల సర్పంచ్, మాజీ సర్పంచ్ లు ఎంపీడీఓ లెక్కల అరుంధతికి వినతి పత్రం అందించారు. గురువారం మండల కేంద్రంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్లకార్డులతో బస్టాండ్ సెంటర్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు దుగ్గొండి మండల మాజీ సర్పంచ్ లు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మాజీ సర్పంచ్ లు మాట్లాడుతూ.. మండలంలోని 34 గ్రామ పంచాయితీల్లో తాము పదవీకాలంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల బిల్లులు ఇప్పటికీ విడుదల చేయలేదని వాపోతున్నారు. గ్రామాభివృద్ధి పనులు, అధికారులు ఆదేశించిన పనులు, పంచాయితీ తీర్మాన పనులు, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా చేపట్టిన పనులు మరియు మనఊరు-మనబడి ద్వారా చేయ్యాల్సిన అన్ని పనులను అప్పులు చేసి మరీ పూర్తి చేశామని అన్నారు.

అయితే ఇప్పటివరకూ చేసిన పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ. 6కోట్ల వరకు రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో.. తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ పదవీకాలం పూర్తయి 9నెలలు గడుస్తున్నా.. నాటి గౌరవ వేతనం కూడా అందలేదని అన్నారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రేవూరి సురేందర్ రెడ్డి, నీలం పైడయ్య, మోడెం విద్యాసాగర్, ఓడేటి తిరుపతి రెడ్డి, మొగ్గం మహేందర్, లింగంపల్లి ఉమ రవీందర్, అంకిల్ల సునీత రవి, ఏడెల్లి రజిత ఉమేష్ రెడ్డి, కొంగర రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed