సర్వాంగ సుందరంగా మారనున్న పాకాల..

by Kalyani |
సర్వాంగ సుందరంగా మారనున్న పాకాల..
X

దిశ, ఖానాపురం: పాకాల పై పట్టింపేది అనే శీర్షికన రెండు రోజుల క్రితం 'దిశ' వరంగల్ టాబ్లాయిడ్ లో కథనం ప్రచురితం అయిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాకాల ను జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని చెప్పడం, అందుకు కృషి చేస్తున్నామని చెప్పడం ప్రత్యేకతను సంతరించుకుంది. పాకాల పై పర్యాటక శాఖ శీత కన్ను వేసిందన్న కథనం ‘దిశ’ లో వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే దొంతి వెంటనే స్పందించి డీపీఆర్ ఏజెన్సీ బృంద సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించడం ‘దిశ’ కి గర్వకారణం గా ఉంది. వేలాది రైతుల ఆత్మ బంధువు అయిన పాకాల సరస్సు, లక్షలాది పర్యాటకులను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. ఇదే చిత్తశుద్ధితో పాకాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధను కొనసాగిస్తే దేశంలోనే ఉత్తమ పర్యాటక ప్రాంతంగా పాకాల ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది.

వివరాల్లోకి వెళితే నర్సంపేట పట్టణానికి అతి సమీపంలో ఉన్న పాకాల సరస్సు ప్రకృతి సిద్ధమైన అడవి ప్రాంతాన్ని దేశంలోని అత్యున్నతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఏజెన్సీ తో కలిసి పాకాల అడవి ప్రాంతంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి పర్యటించారు. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకతీయుల కాలం నాటి ఈ సరస్సును ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి డీపీఆర్ ఏజెన్సీ తో కలిసి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడారు. ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పాకాల సరస్సు దేశంలోనే అత్యంత ప్రకృతి సిద్ధమైన సరస్సు గా ప్రసిద్ధి గాంచిందన్నారు.

పాకాల అడవి ప్రాంతం నేషనల్ బొటానికల్ గార్డెన్ గా ప్రసిద్ధి చెందిందని, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు లో భాగంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 180 కిలోమీటర్ల దూరంలో వరంగల్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాలను జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రాల రూపకల్పన చేయడానికి డీపీఆర్ ఏజెన్సీ బృందంతో పాటు పాకాలను సందర్శించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనిలో భాగంగా గుండం చెరువు - శివాలయం అభివృద్ధి, గుండం చెరువు - పార్క్ వ్యూ పాయింట్, జంతు ప్రదర్శనశాల వంటివి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed