ఎనుమాముల మార్కెట్‌లో చెక్కుల తిప్పలు..! అభివృద్ధి పనులకు ఆటంకాలు

by Shiva |   ( Updated:2024-10-05 03:02:33.0  )
ఎనుమాముల మార్కెట్‌లో చెక్కుల తిప్పలు..! అభివృద్ధి పనులకు ఆటంకాలు
X

దిశ, వరంగల్‌ టౌన్‌: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పరిపాలన పడకేసింది. ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు అటకెక్కాయి. రైతుల సౌలభ్యం కోసం చేపట్టిన నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా అలాంటి పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు కాదు రూ.12 కోట్లకు పైగా నిధులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఫలితంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత పద్దెనిమిది నెలలుగా నిధుల విడుదల నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 25 చెక్కులు ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కనీసం రూ.53వేల విలువైన చెక్కు కూడా పాస్‌ అవ్వకపోవడం గమనార్హం. దీంతో 18 నెలలుగా మార్కెట్‌ యార్డులో చేపట్టిన వివిధ పనులు నిలిచిపోయాయి.

నిధులు లేవా?

చెక్కులు చెల్లుబాటు కాకపోవడానికి నిధులు లేవా అంటే మార్కెట్‌కు వచ్చే ఆదాయం ఎప్పటికప్పుడు ట్రెజరీలో జమ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే, గతంలో మార్కెట్‌ ఆధ్వర్యంలోనే ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆ అధికారాన్ని మార్కెట్‌ నుంచి తొలగించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అప్పటి నుంచి మార్కెట్‌ ఆదాయం అంతా ప్రభుత్వ ఖజానాలోకే చేరుతోందనే టాక్ వినిపిస్తోంది. ఫలితంగా చెక్కుల చెల్లుబాటు విషయంలో జాప్యం చోటుచేసుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులను ఎక్కడికక్కడ నిలిపివేసినట్లుగా సమాచారం.

మంత్రి చొరవ తీసుకోవాలి..

మార్కెట్‌ నిధుల విడుదలలో జాప్యంపై మంత్రి కొండా సురేఖ చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రైతుల సౌలభ్యం కోసం చేపట్టిన నిర్మాణాలు నిలిచిన నేపథ్యంలో మంత్రి ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వంతో చర్చలు జరిపి నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చెక్కులు పెండింగ్‌ వాస్తవమే..

చెక్కులు పెండింగ్‌లో ఉన్నది వాస్తవమే. గడువు ముగియగానే మళ్లీ రీ షెడ్యూల్‌ చేస్తున్నాం. ఇలా మూడు దఫాలుగా జరుగింది. ప్రభుత్వం చొరవ తీసుకుంటే చెక్కుల నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. నిధులు విడుదల కాకపోవడంతో మార్కెట్‌ యార్డుల్లో చేపట్టిన పలు అభివృద్ధి నిర్మాణాలు ఆగిపోయాయి. వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం.

– పోలెపాక నిర్మల, మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి, ఏనుమాముల.

Advertisement

Next Story

Most Viewed