యాసంగికి పెట్టుబడి లేక క‌ష్టాలు.. ధాన్యం డ‌బ్బుల‌ కోసం ఎదురుచూపులు

by Disha News Web Desk |

దిశ, బయ్యారం: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మకోవడానికే అనేక ఇబ్బందులు పడ్డ రైతులు, ఇప్పుడు ఆ ధాన్యం బిల్లుల కోసం కూడా పడరాని పాట్లు పడుతున్నారు. వారాలు గడుస్తున్నా.. ధాన్యం డబ్బులు చెల్లించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా అనేకమంది రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గతేడాది 2021 నవంబర్ మాసం చివరి నుండి జిల్లా సివిల్ సప్తై అధికారులు తెలిపిన సమాచారం మేరకు ఐకేపీ 69, సొసైటీ 146, జీసీసీ 10, మార్కెట్ 05, మెప్మా 01, రైతు సమన్వయ కమిటీల 03, మొత్తం కొనుగోలు కేంద్రాల ద్వారా 37,540 మంది రైతుల నుండి 1,80,856.760 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో ఇప్పటివరకు ధాన్యం అమ్మిన 14,786 మంది రైతుల 72,396.400 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.141,13,89360 మాత్రమే బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ఇంకా 22,754 మంది రైతుల 1,08,460. 360 మెట్రిక్ టన్నుల ధాన్యానికి డబ్బులు పడలేదని తెలిసింది. కాగా, మొత్తం జిల్లాలో 50.23 శాతం మంది రైతులకు ధాన్యం డబ్బులు రాగా, ఇంకా 49.87 శాతం డబ్బులు పడలేదు.

బయ్యారం మండలంలో ధాన్యం కొనుగోల్లు

బయ్యారం మండలంలో 16 సోసైటీ, 08 ఐకేపీ కేంద్రాల ద్వారా మండల వ్యాప్తంగా 2,30,674 లక్షల బ్యాగుల ధాన్యం 1870 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. వీరిలో 900 మందికి ట్యాప్‌లో ధాన్యం వివరాలు పొందుపరిచి బిల్లుకోసం చేశారు. వారిలో సుమారుగా 438 మంది రైతులకు ధాన్యం డబ్బులు వచ్చాయి. 8 ఐకేపీ కేంద్రాల నుండి(40 కేజీల) 20,9,662 లక్షల బస్తాలు 1792 మంది రైతుల నుండి కొనుగోలు చేశారు. వీరిలో 800 మంది రైతుల డాటాను ట్యాప్‌లో నిర్వాహకులు పొందుపరిచారు. కొన్ని ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ఇప్పటివరకు రైతుల ధాన్యం బిల్లులు ట్యాప్‌లో పొందుపరచలేదు. దీంతో మండలంలో సొసైటీ, ఐకేపీ నుండి 44,0336 బస్తాల 1,76,1344 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రాక 3,6,662 మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

డబ్బులు వేయాలని ప్రాధేయ పడుతున్నా: కందాల వీరన్న, బయ్యారం(కౌలురైతు)

నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశాను. ధాన్యం కొనుగోలు సెంటర్లలో 900 బస్తాలు 20 రోజుల క్రితం కాంటా పెట్టాను. అన్ని పత్రాలు ఇచ్చాను. నా ఫోన్‌కు వచ్చిన ఓటీపీ కూడా చెప్పాను. అయినా, ఇంకా నా అకౌంట్‌లో డబ్బులు పడలేదు. ప్రభుత్వం రైతుల ధాన్యం డబ్బులు మంజూరి చేయాలని ప్రాధేయ పడుతున్నాను.

చావాల బతకాలా: అబ్బరబోయిన రాంబాబు(చిన్నరైతు)

నేను ధాన్యం కొనుగోలు సెంటర్‌లో కాంటాలు పెట్టి 15 రోజులు అవుతుంది. ఐదు ఎకరాల ధాన్యం 190 బస్తాలు కాంటా పెట్టాను. కాంటాలు పెట్టి 20 రోజులు అవుతున్నా.. నేటికీ డబ్బులు పడలేదు. అప్పు తెచ్చి వ్యవసాయం చేశాను. వడ్డీలకు ఇచ్చిన వాళ్లు రోజూ మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు తొందరగా వచ్చేటట్లు చేయాలి. ఏం చేయాలో తెలియట్లేదు. రోజూ ఇంటిముందు నా పరువు పోతుంది.

Advertisement

Next Story

Most Viewed