అర్ధరాత్రి హై వోల్టేజ్.. ప్రజల్లో హై టెన్షన్.. 

by Sumithra |
అర్ధరాత్రి హై వోల్టేజ్.. ప్రజల్లో హై టెన్షన్.. 
X

దిశ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ పడమర కోటలోని కాపువాడలో అర్ధరాత్రి హై వోల్టేజ్ తో ప్రజల్లో హై టెన్షన్ పుట్టింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా నివాస గృహాలకు హై ఓల్టేజ్ తో కూడిన పవర్ సప్లై జరిగింది. ఈ హై వోల్టేజ్ కారణంగా దాదాపు 20 నివాస గృహాల్లోని బల్బులు, కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు, ఒక్కసారిగా భయంకర శబ్దంతో పేలి, కాలిపోయాయి. కరెంటు మెరుపులతో ఇల్లు ఎక్కడ కాలిపోతుందో అని భయంతో ప్రజలు రాత్రంతా మెలకువతోనే కూర్చున్నారు.

నైట్ డ్యూటీ చేయవలసిన అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంతో దాదాపు రెండు గంటల పైగా హై వోల్టేజ్ పవర్ సప్లై అవ్వడంతో 38 డివిజన్ లోని 6వ బ్లాకులో ఆస్తి నష్టం బాగా జరిగింది. ఒకవేళ ఆ హై వోల్టేజ్ వల్ల పేదవారి గుడిసెలు, పెంకుటిల్లులు అగ్నికి ఆహుతి అయితే ఆస్తి నష్టమే కాకుండా భారీ ప్రాణనష్టం కూడా జరిగి ఉండేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జరిగిన ఆస్తి నష్టం ఎవరు సమకూరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి విద్యుత్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఎలక్ట్రికల్ అధికారులు నాణ్యమైన విద్యుత్ సప్లై చేసి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. చిన్నపాటి వర్షాలకి కరెంటు తీగలు తెగుతున్నాయని ఇప్పటికైనా విద్యుత్ స్తంభాలు, కరెంటు తీగల మరమ్మత్తులు చేసి రాబోయే వర్షాకాలంలో ప్రజలకు విద్యుత్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా విద్యుత్ అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.

హై వోల్టేజ్ పై ఎలక్ట్రికల్ ఏ.డి వివరణ..

గురువారం అర్ధరాత్రి హై వోల్టేజ్ ఘటన పై వరంగల్ ఎలక్ట్రికల్ ఏడీని వివరణ అడగగా ఖిలా వరంగల్ పడమర కోటలోని అగర్తల చెరువు వద్ద చెట్టు విరిగి కరెంటు పోల్ మీద పడడంతో న్యూట్రల్ వైర్ తెగి క్రిందపడిన కారణంగా హై వోల్టేజ్ పవర్ సప్లై జరిగిందని, మరల ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed