- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీళ్లు మింగుడే..!
దిశ, వరంగల్ టౌన్ : నీళ్లు కూడా వ్యాపార వస్తువుగా మారుతాయని వీరబ్రహ్మం కాలజ్ఞానంలో చెప్పినట్లు పెద్దలు అంటుంటారు. అది ఎంతవరకు నిజమో గానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు అద్దం పడుతున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లో విచ్చలవిడిగా నీటి వ్యాపారం కొనసాగుతోంది. ట్రైసిటీస్‌లో దాదాపు 300లకు పైనే వాటర్ ప్లాంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మూడు బాటిళ్లు, ఆరు క్యాన్లు..
గ్రేటర్ వరంగల్ బల్దియా ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నా.. ప్రజలు తాగునీటి కోసం మినరల్ వాటర్‌కు అలవాటు పడినట్లు అర్థమవుతోంది. ఇంటి నుంచి అడుగు బయట పెడితే చాలు.. దాహం వేస్తే.. వాటర్ బాటిల్ కోసం వెతుక్కునే పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్ర‘జల’ అవసరాన్ని ఆసరా చేసుకున్న పలువురు నీటి వ్యాపారానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ట్రైసిటీస్‌లో వాడకో వాటర్ ప్లాంటు ఉన్నట్లు తెలుస్తోంది. మూడు బాటిళ్లు.. ఆరు క్యాన్లుగా వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
అనుమతులు లేకున్నా..
ట్రైసిటీస్‌లో ప్రస్తుతం నెలకొన్న వాటర్ ప్లాంట్లలో ఏ ఒక్కదానికి కూడా అనుమతులు లేనట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి వాటర్ ప్లాంటు నిర్వహణకు కనీస అనుమతులు అవసరం. అవేవీ లేకుండానే... వ్యాపారం నెరపుతున్నట్లు తెలుస్తోంది. బాటిళ్ల పై ఎలాంటి వివరాలు లేకుండానే కొందరు వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోవలో కొందరు బడారాజకీయ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నీటి అవసరాలు ఎక్కువగా ఉన్న బార్ షాపుల యజమానులు కూడా సొంతంగా వాటర్ ప్లాంట్లు పెట్టుకుని అనుమతులు లేకుండానే కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. వీటిపై బల్దియా ప్రజారోగ్య విభాగం దృష్టి సారించకపోవడంతో వీరివ్యాపారానికి అడ్డులేకుండా పోతోంది.
విస్తుగొలిపే అధికారుల సమాధానం..
మంచినీళ్ల ముసుగులో జరుగుతున్న వాటర్ ప్లాంట్ల వ్యాపారం పై అధికారుల సమాధానం వింటే విస్తుబోవాల్సిందే. వాటర్ ప్లాంట్ల అనుమతులు ఇవ్వడం తమ పరిధిలో లేనిదని, అలాంటి అర్జీలు కూడా తమ పరిశీలనకు రాలేదని భూగర్భ జల శాఖ, మున్సిపల్ శాఖ, ఫుడ్ సెక్యూరిటీ శాఖ.. ఇలా ఏ శాఖను కదలించినా తమకు తెలియదనే సమాధానం చెప్పడం గమనార్హం. నగరంలో ఐదేళ్ల క్రితం బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సర్వేలో 150కి పైగా వాటర్‌ప్లాంట్లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తున్నా.. అధికారులు వాటిపై దృష్టిసారించకపోవడం మరింత విస్మయానికి గురి చేస్తోంది. బల్దియా పరిధిలో ఎలాంటి వ్యాపారం నిర్వహించినా.. ట్రేడ్ లైసెన్స్ అవసరమని అందరికీ తెలిసిందే.
రోడ్డు మీద చాయ్ దుకాణం పెట్టుకున్నా.. లైసెన్స్ ఉందా అంటూ ఆరాతీసే మున్సిపల్ అధికారులు.. నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న వాటర్ ప్లాంట్ల నిర్వహణ పై దృష్టి సారించకపోవడం, పైగా వాటర్ ప్లాంట్లకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పేర్కొనడం.. విధుల పట్ల వారికున్న నిబద్ధతకు, నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రభుత్వ శాఖల పనితీరు, సమన్వయం కరువయిందనడానికి నగరంలో జరుగుతున్న జలదోపిడీకి బంగారు బాటలు వేసిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ప్రజారోగ్యం పరిరక్షణ కోసం ప్రభుత్వ అధికారులు కుర్చీలు వదిలి... క్షేత్రస్థాయిలో దృష్టిసారిస్తే అడ్డగోలు నీటివ్యాపారానికి అడ్డుకట్ట పడడమే కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందనే వాస్తవాన్ని అధికారులు గుర్తించగలగాలి.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి..
దప్పిక తీర్చుకునే క్రమంలో ప్రతిఒక్కరూ వాటర్ బాటిళ్ల పై లేదా కుల్లా వాటర్ పై ఆధారపడడం పరిపాటిగా మారిపోయింది. గొంతు తడుపుకోవడంలో తొందరపాటుతో తాగేనీరు స్వచ్ఛమైనదేనా అని పరిశీలించలేకపోతున్నాం. అదే ఆసరాగా చేసుకుని కొందరు నీటిని వ్యాపారంగా మార్చుకుని, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా మినరల్ వాటర్ పేరిట ప్రజలను దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీల్డ్ వాటర్ బాటిళ్లను పరిశీలిస్తే.. దాని పై ముద్రితమై ఉన్న ఆధారాలు సరైనవో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అప్పుడే నాణ్యమైన నీరు లభ్యమవుతుందని గుర్తెరిగితే.. మన ఆరోగ్యం మన చేతిలో పదిలంగా ఉంటుందనేది నగ్నసత్యం.