మా గ్రామాన్ని విలీనం చేయొద్దు..!

by Kalyani |
మా గ్రామాన్ని విలీనం చేయొద్దు..!
X

దిశ, చెన్నారావుపేట: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామంలో పత్తినాయక్ తండా విలీనం కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తండా వాసుల అనుమతి లేకుండా విలీనం ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో, అధికారులతో తండా వాసులు వాగ్వాదానికి దిగారు. అమీనాబాద్ గ్రామంలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ పత్తినాయక్ తండా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముమ్మాటికి ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : మాజీ ఎమ్మెల్యే పెద్ది

చెన్నారావుపేట మండలంలోని పత్తినాయక్ తండా గ్రామపంచాయతీని అమీనాబాద్ లో విలీనం చేయాలనే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. తండాలు ఆత్మగౌరవం, స్వయంప్రతిపత్తితో బ్రతకాలనే ఉద్దేశంతో నాడు తండాలను గ్రామపంచాయతీలుగా కేసీఆర్ మార్చినట్లు గుర్తు చేశారు. అందులో బాగంగానే నర్సంపేట నియోజకవర్గంలో 76 నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే సొంత గ్రామంలో పత్తి నాయక్ తండాను విలీనం చేయాలనుకోవడం తండావాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు.

తండా ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా బయట వారిని తీసుకువచ్చి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామసభ, గ్రామస్తులు, గ్రామ సంబంధిత అధికారుల సమక్షంలో జరగాలన్నారు. కానీ గిరిజనేతర, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో వారి అభిప్రాయాన్ని తండావాసులపై రుద్దటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed