ధరణి రూటే సప‘రేటు’.. రైతుల నడ్డి విరుస్తున్న ఆన్​లైన్ రిజిస్ట్రేషన్

by Mahesh |
ధరణి రూటే సప‘రేటు’.. రైతుల నడ్డి విరుస్తున్న ఆన్​లైన్ రిజిస్ట్రేషన్
X

దిశ, ఖిలా వరంగల్: తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రైతులను ఆర్థికంగా ఇబ్బుందులకు గురిచేస్తుంది. ధరణి రాకముందుకు భూముల క్రయవిక్రయాల ధరల నియంత్రణ రెవెన్యూ శాఖ పరిధిలో ఉండేవి. ఒక మండల భూమి క్రయవిక్రయాలలో మార్కెట్ రేటు హెచ్చుతగ్గులు ఉంటే సరి చేసే అధికారం రెవెన్యూ శాఖకు ఉండేది. తెలంగాణ ప్రజలకు తమ ఆస్తి నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2020లో ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. ఆస్తి రిజిస్ట్రేషన్లను మొత్తం విధానాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ పోర్టల్‌ను తెచ్చింది. ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ల్యాండ్ మ్యుటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు ధరణి పోర్టల్ ఒక గమ్యస్థానంగా ఉంది.

కానీ ధరణి వచ్చాక అన్ని భూముల క్రయవిక్రయాల ఫీజు రెవెన్యూ శాఖకు సంబంధం లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ లో ధరణి పోర్టల్ ధర ఎంత నిర్ణయిస్తే డబ్బులు రైతులు ఆన్​లైన్​లోనే కట్టాలి. ఇక్కడ ఒక గ్రామ పరిధిలో భూమి క్రయవిక్రయుల ధర సరైనవేనా కాదా? ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా అని పరిశీలించే అధికారం మండల ప్రతినిధి తహసీల్దార్ కు కూడా లేదు. కేవలం ఆన్​లైన్​ ధర ఎంత నిర్ణయిస్తే అంతకే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఒక మండల భౌగోళిక పరిస్థితులు, భూమి క్రయవిక్రయాలు మరియు అక్కడి మార్కెట్ ధరలు పూర్తిస్థాయిలో మండల తహసీల్దార్ అవగాహన కలిగి ఉంటారు. కానీ, ధరణి పోర్టల్ తో ఆన్​లైన్ ధర నే తహసీల్దార్ శిరసా వహించాల్సి వస్తుంది.

ధరణి మోసపూరిత విధానం సాక్షాలతో..

ఖిలా వరంగల్ కు చెందిన ఓ వృద్ధ రైతు తన వ్యవసాయ భూమిని ముగ్గురి కొడుకులకు వారసత్వం కింద సమాన భాగాలుగా పంపకాలు చేశారు. సమ భాగాల్లో భూమి కొలతల ప్రకారం తనకున్న 321B సర్వే నెంబర్ లో 63 గుంటల భూమిని ముగ్గురు కొడుకులకు ఒక్కొకరికి 21 గుంట చొప్పున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆన్​లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్నాడు. ముగ్గురు కొడుకులు తమ వారసత్వ వాటా కింద వచ్చిన భూమి కి ఆన్​లైన్ లో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు చలాన్ పేమెంట్ చేయగా ముగ్గురు కొడుకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

ముగ్గురిని సర్వే నెంబర్ కూడా ఒకటే కానీ ప్రభుత్వానికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద చెల్లించవలసిన ఫీజులు మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. మొదటి కొడుకు 321B సర్వే నెంబర్ లో 21 గుంటలకు అప్లికేషన్ నెంబర్ 2300378982 ద్వారా రూ.22,918, రెండో కొడుకు అదే 321 B సర్వే నెంబర్ లో 21 గుంటల భూమికి అప్లికేషన్ నెంబర్ 2300381301 ద్వారా రూ.51,258, మూడవ కుమారుడు 321B సర్వే నెంబర్ లో 21 గుంటలకు అప్లికేషన్ నెంబర్ 2300382168 ద్వారా రూ.51,258 చెల్లించాడు.

గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు చెల్లించాల్సిన ఫీజు శాతం ఎంత?

ఎవరైనా తమ వారసులకు ఆస్తులను గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద ఇచ్చినప్పుడు వారసులు 3 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆ నాటి నుంచి ఆ ఆస్తికి వారసులు హక్కు పొందుతారు. కానీ, ధరణి పోర్టల్ సవతి ప్రేమ చూపించినట్లు ఒక్కో వారసుడికి ఒక్కో రేటు నిర్ణయించి రుసుము వసూలు చేస్తుంది. ధరణి లెక్క ప్రకారం పెద్ద కుమారుడు మూడు శాతం ప్రభుత్వానికి రుసుం చెల్లించగా, మిగతా ఇద్దరు కుమారులు 7 శాతం రుసుము చెల్లించారు. అంటే 4శాతం వ్యత్యాసం అధికంగా చెల్లించారు. ఇదెక్కడి న్యాయం అంటూ రైతులు మండిపడుతున్నారు. అన్నకో న్యాయం.. తమ్ముళ్లకో న్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టెక్నికల్ మిస్టేక్ అంటూ మాట దాటవేట..

ఇదే విషయమై వరంగల్ జిల్లా ధరణి ఇన్​చార్జి డీసీ కి ఫిర్యాదు చేయగా ఆన్​లైన్​ మిస్టేక్ అంటూ మా టెక్నికల్ టీం కాంటాక్ట్ అవుతుందని మాట దాటవేశారు. ఇప్పటికీ ఎవరూ స్పందించలేదని సదరు రైతులు వాపోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ధరణి ద్వారా ఎంతో మంది రైతులు నష్టపోతున్న సరిచేసే అధికారులే కరువయ్యారు. ప్రతిసారి ధరణి ఆన్​లైన్​అంటూ మాటలు దాటవేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని రైతులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story