DCC Bank : డీసీసీ బ్యాంకులో క్రాఫ్ లోన్లు బంద్..

by Sumithra |
DCC Bank : డీసీసీ బ్యాంకులో క్రాఫ్ లోన్లు బంద్..
X

దిశ, పర్వతగిరి : మండలంలోని కల్లెడ గ్రామంలో ఉన్న డీసీసీ బ్యాంక్ లో ( DCC Bank ) గత పది రోజులుగా క్రాఫ్ లోన్లు మంజూరు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు, రేపు అంటూ తిప్పుతున్నారని అటు పనులు చేసుకోలేక ఇటు బ్యాంకు చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. మరోవైపు మూడు వందల మంది దాకా 2 లక్షలలోపు రుణమాఫీ కాలేదని బ్యాంకు చుట్టూ, మండల వ్యవసాయ అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితి. ఓ వైపు రుణమాఫీ గాక మరోవైపు నూతనంగా రుణం రాక రైతులు ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. బ్యాంకు వద్ద రుణాలు ఇవ్వడం లేదని కనీసం బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని, ఎలాంటి సమాచారం రైతులకు ఇవ్వలేదని, తీరా బ్యాంకుకు వచ్చాక రేపు మాపు అంటూ పబ్బం గడుపుతున్నారని వాపోతున్నారు. బ్యాంకు రుణాలు ఆపేశామని రైతులకు చెప్పకుండా గోప్యంగా బ్యాంకు అధికారులు ఉంచడం ఎంతవరకు సమంజసం అని రైతులు నిలదీస్తున్నారు. చౌటపల్లి పీఏసీఎస్ పరిధిలో వడ్లకొండకు చెందిన కొంతమంది రైతులకు డబ్బులు తీసుకొని కూడా రుణం ఇప్పించలేదని, తమకంటే వెనుక వచ్చిన రైతులకు డబ్బులు ఇచ్చిన వారికే రుణాలు మంజూరు చేశారని, తమకు మంజూరు చేయలేదని వాపోతున్నారు.

పది రోజుల నుండి పంట రుణాలను ఆపడం నిజమే.. డీసీసీ బ్యాంకు మేనేజర్ పూర్ణచందర్

పై అధికారుల ఆదేశాల మేరకు పంట రుణాలను ఆపేసింది వాస్తవమే... గత పది రోజులుగా వచ్చిన రుణాల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయంటున్నారు బ్యాంక్ మేనేజర్. నాబార్డ్ నుండి వచ్చే రుణాలు డీసీసీ బ్యాంకుకు ఆపివేశారని తెలిసిందన్నారు. రైతుల వద్ద నుండి ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తే 8% శాతం వడ్డీ నాబార్డ్ కి కానీ, ఆర్బీఐ కానీ డీసీసీ కట్టాల్సి వస్తుంది. దానిపై చర్చ నడుస్తుందని సమాచారం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ వడ్డీ విషయమై మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాము. వచ్చేనెల మొదటి వారంలో మళ్లీ రుణాలను మంజూరు ప్రక్రియను మొదలుపెడతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed