కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌..ప‌శ్చిమలో జంగా, నాయినిల మ‌ధ్య ఆధిప‌త్య పోరు

by samatah |   ( Updated:2023-06-28 03:37:16.0  )
కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌..ప‌శ్చిమలో జంగా, నాయినిల మ‌ధ్య ఆధిప‌త్య పోరు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ ప‌శ్చిమ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ కంటిన్యూ అవుతోంది. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్ ఆశిస్తున్న హ‌న్మకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేంద‌ర్ రెడ్డి, జ‌న‌గామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘ‌వ‌రెడ్డి మ‌ధ్య రాజ‌కీయ ప్రచ్ఛన్నయుద్ధం జ‌రుగుతోంది. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో కాంగ్రెస్ నాయిని, జంగా వ‌ర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండ‌టం గ‌మ‌నార్హం. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ కాంగ్రెస్ టికెట్ త‌న‌కంటే త‌న‌కే వ‌స్తుంద‌ని, ఎవ‌రికి వారుగా అనుచ‌రుల వ‌ద్ద ధీమాగా చెబుతూ దూసుకెళ్తున్నారు. జాతీయ‌, రాష్ట్ర అధినాయ‌క‌త్వం చెబుతున్న కార్యక్రమాల‌ను పోటాపోటీగా గ్రౌండ్‌లో అమ‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. హ‌న్మకొండ‌లోని పార్టీ కార్యాల‌యం కేంద్రంగా కాంగ్రెస్‌ను నాయిని ముందుకు తీసుకెళ్తుండ‌గా, హ‌న్మకొండ హంట‌ర్ రోడ్డులో త‌న క్యాంపు కార్యాల‌యాన్ని ప్రారంభించి జంగా మ‌రింత దూకుడు పెంచ‌డం విశేషం.

నేను లోక‌ల్‌.. నాకే టికెట్‌..!

కాజీపేట‌లో పుట్టి పెరిగిన త‌న‌కు సొంతగా భారీ ఓటు బ్యాంకు ఉంద‌ని జంగా రాఘ‌వ‌రెడ్డి అధిష్టానం పెద్దల‌కు విన్నవిస్తూ వ‌స్తున్నారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో లోక‌ల్‌గా ఉన్న త‌న‌కు టికెట్ అడిగే హ‌క్కు, అధికారం, అర్హత ఉన్నాయ‌ని బ‌లంగా వాదిస్తున్నారు. ప్రజాబ‌లం లేకుండా కేవ‌లం పార్టీలో కొన‌సాగినంత మాత్రనా టికెట్ అడిగితే ఏం ప్రయోజ‌నం ఉండ‌దంటూ ప‌లుమార్లు నాయిని రాజేంద‌ర్ రెడ్డిని ఉద్దేశించి జంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం పోటీ ఉండ‌టం స‌హ‌జ‌మ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో ఆధిప‌త్య ప్రద‌ర్శన‌కు దిగ‌డాన్ని ఆయ‌న స‌మ‌ర్థించుకుంటున్నారు. పార్టీ గెలుపు గుర్రాల‌కే టికెట్ కేటాయిస్తుంద‌ని, అందులో తాను ఉన్నట్లుగా చెప్పుకొస్తుండ‌టం గ‌మనార్హం. పార్టీ టికెట్ ఆశించ‌డం ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా త‌ప్పుకాద‌న్న ధోర‌ణిని ఆయ‌న వైఖ‌రి ద్వారా వెల్లడిస్తున్నారు.

నాకే హ‌క్కు, అర్హత ఉన్నాయ్‌..!

పార్టీని న‌మ్ముకుని ఏళ్లుగా ప‌నిచేస్తున్నందుకు ఈసారి త‌ప్పకుండా వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌న్న ధీమాతో నాయిని రాజేంద‌ర్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న పార్టీ కార్యక్రమాల‌ను గ్రౌండ్‌లోకి తీసుకెళ్లేందుకు డివిజ‌న్లలో ప‌ర్యటిస్తున్నారు. పార్టీ అధినాయ‌క‌త్వం చేస్తున్న సూచ‌న‌ల‌ను తూచ త‌ప్పకుండా పాటిస్తూ వ‌స్తున్నారు. టికెట్ విష‌యంలో జంగా రాఘ‌వరెడ్డితో ఎదుర‌వుతున్న పోటీపై మాత్రం ఆయ‌న కొంత ఆందోళ‌న చెబుతున్న మాట వాస్తవం. అయితే పార్టీపై తాను చూపుతున్న విధేయ‌త‌కు అన్యాయం జ‌ర‌గ‌ద‌న్న న‌మ్మకాన్ని ప‌లుమార్లు ఆయ‌న వ్యక్తం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో పొత్తుల్లో భాగంగా వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్ టీడీపీకి కేటాయించ‌డంతో నాయిని పోటీ చేసే అవ‌కాశాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో త్యాగాన్ని ఈ సారి పార్టీ అధినాయ‌క‌త్వం గుర్తిస్తుంద‌న్న ధీమాతో ఉండ‌టం విశేషం. పార్టీకి ఇన్నేళ్లుగా అంకిత‌భావంతో ప‌నిచేస్తున్న త‌న‌కు టికెట్ కోసం బ‌లంగా కొట్లాడే అర్హత‌, హ‌క్కు ఉన్నాయ‌ని చెప్పుకొస్తుండ‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలో జంగాకు షాకిచ్చిన అధిష్టానం.. ఆ త‌ర్వాత సైలెంట్‌ !

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో నాయిని వ‌ర్సెస్ జంగాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు రోజురోజుకూ ఉధృత‌మ‌వుతోంది. ఎవ‌రికి వారుగా ఎన్నిక‌లకు సిద్ధమ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇద్దరి మ‌ధ్య రాజ‌కీయ పోరు సాగుతుండ‌టంతో పార్టీలో చీలిక స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇద్దరి నేత‌ల‌ను స‌మ‌న్వయ ప‌రిచేందుకు అధిష్టానం నుంచి సైతం ఇప్పటి వ‌ర‌కు పెద్దగా ప్రయ‌త్నాలు కూడా జ‌ర‌గ‌లేదు. వాస్తవానికి జంగా రాఘవ రెడ్డికి గ‌తంలో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాల‌ని జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి నోటీసుల్లో ఆదేశించారు. అయితే నోటీసులకు మౌఖికంగా జంగా వివ‌ర‌ణ ఇచ్చుకున్నా సంతృప్తి చెంద‌లేదు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దు గాని జంగా కార్యక్రమాల‌కు పార్టీ నుంచి సైతం అభ్యంత‌రం తెల‌ప‌క‌పోవ‌డం విశేషం. దీంతో జంగా బ‌లాన్ని పార్టీ గుర్తించ‌డంతోనే పార్టీ ప‌రంగా ప్రోత్సహించ‌డం గాని నిరుత్సాహ‌ప‌రచ‌డం గాని చేయ‌కుండా గ‌మ‌నిస్తుండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ప‌రిణామం కొంత జంగా శిబిరంలో ఉత్సాహాన్ని క‌లిగిస్తున్నట్లు స‌మాచారం.

Also Read: కొల్లాపూర్‌లో రాజకీయ కాక.. జూపల్లి రాకతో కాంగ్రెస్ లో మారిన సమీకరణలు..

Advertisement

Next Story

Most Viewed