వరద నష్టంపై అధికారులతో సీఎం సమీక్ష

by Sridhar Babu |
వరద నష్టంపై అధికారులతో  సీఎం సమీక్ష
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : ఎడతెరిపి లేని వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం అందించాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూములు కుంటలు, చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు. జల ప్రళయంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తాం అన్నారు. ఆకేరు వాగులో మృతి చెందిన తండ్రి కూతురు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని, వరద ప్రవాహంలో సర్వం కోల్పోయిన మూడు తండాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతంలో ఒకే చోట కాలనీ రూపంలో ఇల్లు నిర్మిస్తామన్నారు.

మృతి చెందిన పశువులకు 50 వేల రూపాయలు, మేకలు, గొర్రెలకు కూడా నష్టపరిహారం అందిస్తాం అన్నారు. వరద ప్రవాహంలో 30 వేల ఎకరాలలో పంటల నష్టం జరిగిందని, ప్రతి ఎకరాకు పదివేల రూపాయల పంట పరిహారం అందిస్తాం అని చెప్పారు. ధ్వంసమైన రహదారులను, ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సహాయాన్ని అందిస్తాం అన్నారు. హైదరాబాద్ లో హైడ్రా తరహా ప్రక్రియను మహబూబాబాద్ లో కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story