రావిలాల వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థల చేయూత

by Aamani |
రావిలాల వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థల చేయూత
X

దిశ,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు విజ్ఞాన దర్శిని, నేషన్స్ ఫస్ట్ హ్యుమన్ చైన్ ఫౌండేషన్, శ్రీ స్వామి నాయక్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రావిరాల గ్రామంలో తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన చెరువు కట్ట తెగిపోయింది. గ్రామ పై భాగంలో ఉన్నటువంటి కొత్తపల్లి చెరువు కూడా తెగడంతో ముంచెత్తిన వరదతో రావిరాల గ్రామంలో సుమారు 150 కుటుంబాలు సర్వం కోల్పోయాయి. గ్రామానికి చెందిన అనేక కుటుంబాలకు చెందిన సరుకులు కొట్టుకుపోయాయి. పలు కుటుంబాల చెందిన గొర్రెలు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి. ఇండ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రావిరాల గ్రామంలోని వరద బాధితులను ఆదుకోవడానికి విజ్ఞాన దర్శిని- రమేష్, నేషన్స్ ఫస్ట్ హ్యుమన్ చైన్ ఫౌండేషన్ - మోహన్ శాస్త్రవేత్త , శ్రీ స్వామి నాయక్ మెమోరియల్ సొసైటీ - శశికళ బ్యాంకు మేనేజర్, స్వచ్చంద సంస్థ సభ్యులు దాతల నుంచి ఆర్థిక సహకారం తీసుకొని, దుప్పట్లు మరియు బట్టలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రావిరాల ప్రజలను ఆదుకోవడం సామాజిక బాధ్యత అని అన్నారు. ముందు ముందు కూడా గ్రామంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తామని భరోసా కల్పించారు. ఈ వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బాధలో ఉన్న తమ కుటుంబాలకు సహాయం చేయడానికి ఎక్కడెక్కడో నుంచి వచ్చిన సంస్థలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేయడం తో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకుడు రమేష్, ఎన్ ఎఫ్ హెచ్ సి ఫౌండేషన్ ప్రతినిధులు సుమన్ రమేష్, గణేష్, శ్రీ స్వామి నాయక్ మెమోరియల్ సొసైటీ ప్రతినిధులు, నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు, ఎంపీడీవో బాలరాజు, హెడ్ మాస్టర్ లింగారెడ్డి, సెక్రటరీ అరుణ, గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల జగ్గయ్య, సీనియర్ జర్నలిస్ట్ అశోక్, విజ్ఞాన దర్శిని ప్రతినిధులు ములుక రవి, చిట్టబోయిన మహేష్, అశోక్, యువకులు మండలి శ్రీకాంత్, కారేం ప్రశాంత్, తుళ్ళ వివేక్, సురేష్, గ్రామ పెద్దలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story