సర్టిఫికెట్ జారీ చేయలేదు.. పైగా రూ.3.81 కోట్ల పెనాల్టీ విధించారు!

by Ajay kumar |
సర్టిఫికెట్ జారీ చేయలేదు.. పైగా రూ.3.81 కోట్ల పెనాల్టీ విధించారు!
X

- చంఢీఘర్‌లో షాకింగ్ ఘటన

- వికలాంగుడైన ఇంటి యజమానికి ఇబ్బందులు

దిశ, నేషనల్ బ్యూరో:

ఐదేళ్లుగా తన ఇంటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలని కార్యాలయం చుట్టూ తిరిగినా, ఇవ్వకుండా వేధించిన అధికారులే.. చివరకు అదే సర్టిఫికెట్ లేదని చెప్పి రూ.3.81 కోట్ల పెనాల్టీ విధించిన సంఘటన చంఢీఘర్‌‌లో చోటు చేసుకుంది. ఆర్కిటెక్ట్ పల్లవ్ ముఖర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టర్ 38లోని ఒక ఇంటిని వేలం పాటలో అనిల్ మెహన్ అనే వ్యక్తి ఒక ఇంటిని ఐదేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. అయితే అప్పటి నుంచి ఎస్టేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పలు కారణాలు చూపించి అతనికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను మాత్రం జారీ చేయలేదు. వికలాంగుడైన బాధితుడు పలువురు అధికారులను కలసి తన సమస్యను చెప్పినా పరిష్కారం దొరకలేదు. ఐదేళ్లుగా పలు కారణాలు చెప్పి కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు. ఇంటి కింద సోలార్ హీటింగ్ సిస్టమ్ కనెక్ట్ చేయలేదని ఒక సారి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ నిర్మించలేదని మరోసారి ఆక్యుపెన్సీ స్టర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు.

దీంతో బాధితుడు సోలార్ హీటింగ్ సిస్టమ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ నిర్మించాడు. అయితే సోలార్ హీటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన పైపు ఒకటి కనెక్ట్ చేయలేదని.. వాటర్ ట్యాంకులో శిథిలాలు ఉన్నాయని మరోసారి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఎస్టేట్ కార్యాలయం ఆమోదించిన డిజైన్ల ప్రకారమే వాటిని ఏర్పాటు చేసినా.. అధికారులు మాత్రం అంగీకరించలేదు. పైగా డిజైన్లను తప్పుగా అనుసరించారంటూ రూ. 3.81 కోట్ల జరిమానా విధించారు. అధికారులు కావాలనే తన క్లయింట్‌ను ఇబ్బంది పెడుతున్నారని, ఇన్నాళ్లూ వాళ్లే సర్టిఫికెట్ ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పి.. ఇప్పుడు అదే సర్టిఫికెట్ లేదని జరిమానా విధించడం అన్యాయమని పల్లవ్ ముఖర్జీ అంటున్నారు. కాగా ఈ విషయాన్ని చంఢీఘర్ డిప్యూటీ కమిషనర్ నిషాంత్ యాదవ్ దృష్టికి తీసుకొని వెళ్లగా తాను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.



Next Story