HUL: రూ. 2,955 కోట్లకు మినిమలిస్ట్‌ను సొంతం చేసుకున్న హెచ్‌యూఎల్

by S Gopi |
HUL: రూ. 2,955 కోట్లకు మినిమలిస్ట్‌ను సొంతం చేసుకున్న హెచ్‌యూఎల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బ్యూటీ స్టార్టప్ బ్రాండ్ మినిమలిస్ట్‌ను ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) సొంతం చేసుకుంది. మినిమలిస్ట్ కంపెనీలో 90.5 శాతం వాటాను రూ. 2,955 కోట్లకు హెచ్‌యూఎల్ కొనుగోలు చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసినట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం, కంపెనీలో మిగిలిన 9.5 శాతం వాటాను కూడా వ్యవస్థాపకుల నుంచి రాబోయే రెండేళ్లలో కొనుగోలు చేయనున్నట్టు హెచ్‌యూఎల్ తన నివేదికలో పేర్కొంది. మినిమలిస్ట్ కొనుగోలు ద్వారా తన బ్యూటీ అండ్ వెల్‌బీయింగ్ పోర్ట్‌ఫోలియోలో కొత్త దశను సూచిస్తుందని హెచ్‌యూఎల్ అభిప్రాయపడింది. కొనుగోలుకు సంబంధించి లావాదేవీ ప్రక్రియ కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలోగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయంగా గత కొన్నేళ్లలో అనేక స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. మార్కెట్ పోటీ ఎదుర్కోవడంతో పాటు అధిక మార్జిన్‌ సొంత ంచేసుకునే వ్యూహంలో భాగంగానే హెచ్‌యూఎల్‌ ఈ కొనుగోలు చేపట్టినట్టు పరిశ్రమలు భావిస్తున్నాయి. 2020లో మోహిత్ యాదవ్, రాహుల్ యాదవ్‌లు స్థాపించిన స్కిన్‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్ దేశీయంగా తక్కువ సమయంలో ఎంతో ఆదరణ పొందింది. ఈ నాలుగేళ్లలో రూ. 500 కోట్ల వార్షికాదాయం కంపెనీ బ్యూటీ మార్కెట్లో అత్యంత వేగంగా విస్తరించింది.

Next Story