తెలంగాణ‌లో అలీబాబా సర్కార్.. త‌రుణ్‌ చుగ్

by Javid Pasha |
తెలంగాణ‌లో అలీబాబా సర్కార్.. త‌రుణ్‌ చుగ్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : తెలంగాణ‌లో అలీబాబా న‌ల‌బై దొంగ‌ల స‌ర్కార్ పాల‌న సాగుతోంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి త‌రుణ్‌ చుగ్ ఎద్దేవా చేశారు. అంతా దోచేయ్‌.. దాచెయ్ అన్న‌ట్లుగా కేసీఆర్ ప‌రిపాల‌న ఉంద‌ని అన్నారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంపై ఈడీ విచారణ చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని అన్నారు. విచార‌ణ సంస్థ‌లు త‌మ ప‌ని తాము చేస్తుంటే బీఆర్ ఎస్ నేత‌లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. లిక్కర్ స్కాం లో విచారణ కోసం పిలిస్తే ఆ విచారణ సంస్థలపైనే ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సభ్యులతో ఆదివారం పోచ‌మ్మ‌మైదాన్ లో జ‌రిగిన స‌మావేశానికి తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌రంగ‌ల్‌కు చేరుకున్న త‌రుణ్‌చుంగ్‌కు వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లా ముఖ్య నేత‌లంతా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ముందుగా పోచమ్మమైదాన్ సర్కిల్ లోని రాణి రుద్రమదేవి విగ్రహనికి పూల మాలవేశారు. అనంత‌రం పార్లమెంట్ ప్రవాస యోజన లో భాగంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ కోర్ కమిటీ సభ్యుల సమావేశనికి హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మంలో వరంగల్ జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు కొండేటి శ్రీధర్, హ‌న్మ‌కొండ జిల్లా అధ్య‌క్షురాలు రావు ప‌ద్మ‌, బీజేపీ రాష్ట్ర నాయ‌కులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు ప‌లువురు ముఖ్య నేత‌లు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించబోతున్నారు..!

తెలంగాణ ప్ర‌జ‌లు బీజేపీని ఆశీర్వ‌దించ‌బోయే రోజులు త్వ‌ర‌లోనే ఉన్నాయ‌ని అన్నారు. అవినీతి, అక్ర‌మాల పాల‌న సాగిస్తున్న కేసీఆర్‌కు, ఆయ‌న కుటుంబానికి ప్ర‌జ‌లు బైబై చెప్పే స‌మ‌యం వ‌చ్చేస్తోంద‌ని అన్నారు.వరంగల్ లో రాణిరుద్రమాదేవి ఆశీస్సులు తీసుకోవటం సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌ను లూటీ చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు , దేశాన్ని దోచుకునేందుకే ఢిల్లీ వైపు బ‌య‌ల్దేరన్నారు. తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో తోలుబొమ్మలా మారింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ప్ర‌భుత్వం చేసిందేం లేద‌ని అన్నారు. ప్ర‌జాధనాన్ని అన్యాయంగా దోచుకుని దాచుకున్నార‌ని అన్నారు.

త‌ప్పు చేసిన‌వాళ్ల‌ను విచారించొద్దా..?!

అక్ర‌మాల‌కు, మోసాల‌కు పాల్ప‌డిన‌వారిని ప్ర‌శ్నిస్తే త‌ప్ప‌వుతుందా..? అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. లిక్క‌ర్ స్కాంలో ఎమ్మెల్సీ క‌విత‌ను విచారిస్తే కేంద్రంపై రాష్ట్ర ప్ర‌భుత్వం దుష్ర్ర‌చారం మొద‌లు పెట్టింద‌ని అన్నారు. ఈడీ విచార‌ణ సంస్థ‌ల‌పై ఒత్తిడి తెచ్చేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒత్తిడి తీసుకువ‌స్తున్నారంటూ ఆరోపించారు. మోసం చేసిన వాళ్లను ప్రశ్నిస్తే తప్పుదారి పట్టించడంలో కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు అంటూ ఎద్దేవా చేశారు. వ‌రంగ‌ల్ అభివృద్ధికి వంద‌శాతం కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని అన్నారు. స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నిధులిస్తుంటే.. కేసీఆర్ సర్కారు నిధులను పక్కదారి పట్టిస్తోంద‌ని అన్నారు. పార్టీ శ్రేణులు అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని అన్నారు. పార్టీ విధానాల‌ను క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్లేందుకు కృష్టి చేయాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story