‘పైసలు.. పనోళ్లు’ ప్రధాన అజెండాగా బల్దియా మీటింగ్‌!

by Jakkula Mamatha |
‘పైసలు.. పనోళ్లు’ ప్రధాన అజెండాగా బల్దియా మీటింగ్‌!
X

దిశ, వరంగల్‌ టౌన్: నిధులు, కమీషన్లు ప్రాతిపదికనే బల్దియా సమావేశాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరంగల్‌ మహానగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశాలన్నీ అలాగే సాగుతున్నాయని కార్పొరేటర్లే ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. నగరంలో మౌలిక వసతుల కల్పన పై పాలకవర్గం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రజలు సైతం మండిపడుతున్నారు. తాజాగా మంగళవారం నిర్వహించనున్న సర్వసభ్య సమావేశంలో నిధులు, నియామకాలే ప్రధాన అజెండా కావడం పట్ల పలువురు కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అటకెక్కిన అభివృద్ధి..

నగరంలో అభివృద్ధి పనులు మందగించాయని పలువురు కార్పొరేటర్లు అంతర్యుద్ధం సాగిస్తున్నారు. మేయర్‌ తీరుపై గుర్రుగా ఉన్నారు. కొన్ని డివిజన్ల పట్ల మేయర్‌ గుండు సుధారాణి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహంతో ఉడికిపోతున్నారు. ఇటీవలే నగరంలోని ఓ కార్పొరేటర్‌ తన డివిజన్‌లో అభివృద్ధి పనులు సాగడం లేదని బల్దియా ఎదుట ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించారు. అదే కోవలో మరికొంతమంది కార్పొరేటర్లు సైతం మేయర్‌ వ్యవహారశైలిపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

మౌలిక వసతులు మృగ్యం..

నగరంలో కనీస వసతులు కరువయ్యాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలు డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సక్రమంగా సాగడం లేదని తెలుస్తోంది. బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మరుగుదొడ్లు నిరుపయోగంగా మారడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక్కో మరుగుదొడ్డి రూ.5 లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన నిర్వహణ లోపంతో నిషానిగా మిగిలిపోవడం విస్మయం కలిగిస్తోంది. స్మార్ట్‌ సిటీ కింద వేసిన రోడ్లు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎల్‌బీ నగర్‌ ప్రాంతంలో నిర్మించిన నాలా అసంపూర్తిగా మిగిలింది. కొన్ని చోట్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌ నామ్‌కే వాస్తే!

దేశాయిపేటలో ప్రతాపరుద్ర ఫిల్టర్‌బెడ్‌ నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. సిబ్బంది సరిగా విధులు నిర్వర్తించడం లేదు. కొన్ని బెడ్లు పని చేయడం లేదు. వాటర్‌ టవర్లు కూడా నామ్‌కే వాస్తే అన్నట్లుగా ఉన్నాయి. పూర్తిస్థాయిలో శుద్ధి కాకుండా నీటిని సరఫరా చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

అవినీతిపై చర్యలు మృగ్యం!

బల్దియా అవినీతికి అడ్డాగా మారిందనే విమర్శలు సర్వ సాధారణమయ్యాయి. ఏకంగా ఓ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ చేసిన రూ.4కోట్ల మేర ప్రజాధనం కొల్లగొట్టినా బల్దియా పాలకులు, అధికారులకు చీమకుట్టినట్టుగా కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. కేవలం సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించి, తమ పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం తప్ప, కాజేసిన ప్రజాధనం తిరిగి తీసుకురావడంలో పాలకులు, అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. అదీగాక, బల్దియా బడా లీడర్ స్వయంగా ఓ ఉన్నతాధికారిని దళారీగా పెట్టుకుని కమీషన్లు వసూలు చేస్తున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. కమీషన్లు వచ్చే బిల్లులను త్వరగా విడుదల చేయడం, నగరంలో కబ్జాలకు, అక్రమ నిర్మాణాలు దొడ్డిదారిన సహకారాలు అందించడమే లక్ష్యంగా చర్యలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

రూ.5 భోజనంలో అక్రమాలెన్నో..?

ఇక బల్దియా ఆధ్వర్యంలో జరుగుతున్న రూ.5 భోజన పంపిణీలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకటికి రెండు ప్లేట్లు అధికంగా రాసి బిల్లులు నొక్కేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రజలకు రూ.5కే భోజనం అందిస్తుండగా, బల్దియా వారికి ప్లేటుకు రూ.27.65 చొప్పున చెల్లిస్తోంది. అయితే, తప్పుడు లెక్కలు చూపించి ఆ డబ్బును వాటాలుగా పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా, మంగళవారం జరిగే సర్వసభ్య సమావేశంలో ఈ పథకానికి రూ.2 కోట్లకు పైగానే చెల్లించేందుకు బల్దియా అజెండాగా సంసిద్ధమైంది. అయితే, ఈ పథకం లెక్కలపై విజిలెన్స్‌ విచారణ చేపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఉన్నవారే పని చేయక!

బల్దియాలో గతంలోనే 452మంది ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిపై తీసుకున్నారు. వీరి నియామకంలో పెద్ద మొత్తంలో అధికారులు, అప్పటి పాలకవర్గం దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, తమకు అన్యాయం జరిగిందని చాలామంది బల్దియా ఎదుట ప్రత్యక్ష ఆందోళనలో చేపట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఆ 452 మందిలో 150 మంది వరకు పని చేయకుండానే వేతనాలు తీసుకుంటున్నట్లు బల్దియా దొంగలకు తెలిసిన విషయమే. ఆ దొంగల్లో కొందరు కార్పొరేటర్ల అనుయాయులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నట్లు ఆరోపణలు ఇప్పటికీ గుప్పుమంటూనే ఉన్నాయి. ఈ వ్యవహారం ఇలా ఉండగానే, సిబ్బంది సరిపోవడం లేదంటూ కొత్తగా మరో 250మందిని తీసుకోవడానికి మేయర్‌ సుధారాణి రంగం సిద్ధం చేశారు. మంగళవారం నాటి సర్వసభ్య సమావేశంలో ఆ తీర్మానం ఆమోదం పొందేందుకు ఇప్పటికే మెజారిటీ కార్పొరేటర్లకు తాయిలాలు కూడా అందించినట్లు తెలుస్తోంది. నియామకాల్లో ఎన్ని లక్షలు చేతులు మారనున్నాయో.. ఎంతమంది అమాయకులు రోడ్డెక్కనున్నారో వేచిచూడాల్సిందే.

కార్పొరేటర్లకు టూర్‌?

ఒక పక్క బల్దియాలో నిధులు లేక అభివృద్ధి మందగించిందని పాలకులు, అధికారులే సెలవిస్తున్నారు. మేయర్‌పై కార్పొరేటర్లు సైతం ఇదే విషయంలో గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో కార్పొరేటర్లను స్టడీటూర్‌కు ముంబై, కేరళ తీసుకెళ్లేందుకు మేయర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంగళవారం నాటి సర్వసభ్య సమావేశం అజెండాలో ఇది కూడా అంశంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘మింగ మెతుకు లేదు గానీ, మీసాలకు సంపెంగ నూనె’ అన్నట్లు.. నిధులు లేమితో కొట్టుమిట్టాడుతున్న బల్దియా పై అదనపు భారం అవసరమా? అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా ప్రజా సమస్యలను గాలికొదిలేసి కేవలం కమీషన్లు, విలాసాలు అజెండాగా జరుగుతున్న మంగళవారం నాటి సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు నగరాభివృద్ధి పై గళం విప్పుతారా? లేదంటే స్టడీటూర్‌ మాయలో మునిగి తేలుతారా? వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed