రాజాసింగ్‌కు విజయశాంతి సపోర్ట్.. ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై ఆసక్తికర ట్వీట్..!

by Satheesh |
రాజాసింగ్‌కు విజయశాంతి సపోర్ట్.. ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై ఆసక్తికర ట్వీట్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో రాజాసింగ్‌పై సస్పెన్షన్ వ్యవహారం సెగలు రేపుతోంది. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్‌ను పార్టీ నుండి బీజేపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు సమీపిస్తున్నా ఆయన సస్పెన్షన్ విషయంలో అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోడవం చర్చనీయాంశంగా మారుతోంది.

ఈ క్రమంలో రాజాసింగ్‌పై త్వరగా తేల్చాలనే డిమాండ్లు పార్టీలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు గోషామహల్‌తో పాటు రాష్ట్రమంతటా పార్టీ ముఖ్య కార్యక్రమాల్లో చురుకుగా ఉండే రాజాసింగ్ ఇప్పుడు అంత యాక్టివ్‌గా కనిపించకపోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్‌కు బీజేపీ నేత విజయశాంతి నుండి అనూహ్యంగా మద్దతు లభించింది. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో ఆమె తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతున్నది. రాజాసింగ్ విషయంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యం అవుతున్నట్లు కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారని, అయితే బండి సంజయ్‌తో సహా బీజేపీ శ్రేణులంతా రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతున్నట్టు ట్వీట్ చేశారు.

తాను కూడా మనస్ఫూర్తిగా సస్పెన్షన్ ఎత్తివేస్తారనే నమ్ముతున్నానని.. అయితే కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు. నిర్ణయం తీసుకోవడం కొంచెం ఆలస్యం అయినట్లు కనిపించనా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచి చేసేదే అవుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న బీజేపీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తుందా.. సరైన సమయంలో అంతా మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఏ క్షణమైనా వేటు ఎత్తివేసే ఛాన్స్?:

రాజాసింగ్ విషయంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా రాష్ట్ర నేతలు మాత్రం ఆయనపై విధించిన వేటు ఎత్తివేయాలని పార్టీ పెద్దల వద్ద విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ఫలితాల అనంతరం చెలరేగిన అంతర్గత కలహాల పరిస్థితి రోజురోజుకు బీజేపీని ఇబ్బందికరంగా మారుస్తున్నాయనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ జోష్‌లో ఉంటే మరోసారి అధికారం తమదే అని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఇంకా వేటు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఇది పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసినా రాజాసింగ్ మాత్రం తన దారి రహదారి అన్నట్లుగా దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారి తన ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రతిసారి రాజాసింగ్ అంశం ప్రస్తావనకు వస్తున్నది. గతంలో అమిత్ షా, నడ్డా రాష్ట్రానికి వచ్చిన సందర్భాల్లో రాజాసింగ్‌కు మద్దతుగా వారి సభల్లో ఫ్లకార్డులు దర్శనం ఇచ్చాయి. అయితే రాబోయే ఎన్నికలు, పార్టీలో పరిణామాలపై బేరీజు వేసుకున్న అధిష్టానం త్వరలో రాజాసింగ్‌పై వేసిన వేటును ఎత్తివేసే దిశగా ఆలోచన చేస్తోందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో గుప్పుమంటున్నది.

Advertisement

Next Story