ఆడ‌పిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. అలాంటి వాటి పట్ల జాగ్రత్త అంటూ వీసీ సజ్జనార్ ట్వీట్

by Kavitha |
ఆడ‌పిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. అలాంటి వాటి పట్ల జాగ్రత్త అంటూ వీసీ సజ్జనార్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేశారంటూ సైబర్ కేటుగాళ్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తుంటాయి. కాబట్టి అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్త అంటూ వీసీ సజ్జనార్ X వేదికగా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ త‌ల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపుల‌కు దిగుతున్నారు అని వెల్లడించారు. వారు అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌కుంటే ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప‌ర్లు చంపేస్తారంటూ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారన్నారు.

"తాజాగా #Hyderabad రాయ‌దుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబ‌ర్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. ''నేను పోలీస్ ఆఫీస‌ర్‌ను మాట్లాడుతున్నాను. కాలేజీకి వెళ్లిన మీ అమ్మాయి కిడ్నాప్‌న‌కు గురైంది. ఆమె ప్ర‌స్తుతం మాద‌గ్గ‌రే ఉంది. వెంట‌నే మేం అడిగినంత డ‌బ్బును ఆన్‌లైన్ ద్వారా పంపించండి. లేకుంటే మీ అమ్మాయిని కిడ్నాప‌ర్లు చంపేస్తారు." అని బెదిరించారు. ఇదిగో మీ అమ్మాయి ఏడుస్తుందంటూ ఒక వాయిస్‌ని వినిపించారు.

ఏడుస్తున్న గొంతు వినిపించ‌డంతో కాలేజీకి వెళ్లిన త‌మ‌ కూతురు కిడ్నాప్‌న‌కు గురైంద‌ని త‌ల్లిదండ్రులు భావించారు. డ‌బ్బులు పంపించేందుకు సిద్ద‌ప‌డ్డారు. మోస‌గాళ్ల‌తో ఫోన్‌లో మాట్లాడుతూనే త‌మ బంధువుల‌కు ఈ విష‌యాన్ని చేర‌వేశారు. త‌మ కూతురు కాలేజీలో ఉందో.. లేదో తెలుసుకోండ‌ని వారిని పంపించారు. ఆమె కాలేజీలో క్షేమంగా ఉంద‌ని చెప్ప‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం నా దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకువ‌చ్చారు. ఈ త‌ర‌హా బెదిరింపు ఫోన్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఆడ పిల్ల‌లను కిడ్నాప్ చేశార‌ని చెప్ప‌గానే న‌మ్మి వారికి డ‌బ్బులు పంపిస్తున్నారు. అజ్ఞాత వ్య‌క్తుల నుంచి విదేశీ ఫోన్ నంబ‌ర్ల‌తో వ‌చ్చే వాట్సాప్ కాల్స్‌కు స్పందించ‌కండి. బెదిరింపుల‌కు జంక‌కుండా స్థానిక పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేయండి” అంటూ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed