దళితులపై అట్రాసిటీ కేసులో 98 మందికి జీవిత ఖైదు.. కేసు వివరాలేంటీ?

by Mahesh Kanagandla |
దళితులపై అట్రాసిటీ కేసులో 98 మందికి జీవిత ఖైదు.. కేసు వివరాలేంటీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటికీ చాలా చోట్ల కుల ఆధారిత దాడులు, హింస జరుగుతున్నది. ఈ హింసకు అడ్డుకట్ట వేసేలా కర్ణాకటకలోని కొప్పల్ జిల్లా, సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దళితులపై దాడులకు తెగబడిన, ఎస్సీ కాలనీలోని మాదిగ గుడిసెలకు నిప్పు పెట్టిన అగ్రవర్ణాలకు చెందిన కొందరు దోషులకు కఠిన శిక్ష విధించింది. ఈ అట్రాసిటీ కేసులో 98 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. దళితవర్గానికి చెందిన ముగ్గురు నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

కేసు:

ఈ కేసు పదేళ్ల క్రితం జరిగిన దుర్ఘటనకు సంబంధించింది. కొప్పల్ జిల్లా, గంగావతి తాలూకాలోని ఓ సినిమా థియేటర్‌లో జరిగిన గొడవ ఈ కేసుకు బీజం వేసింది. గంగావతి తాలూకాలోని మరకుంబి గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణాల యువతకు కొందరు ‘గుర్తు తెలియని’వారికి టికెట్ల విషయంలో థియేటర్‌లో గొడవ జరిగింది. తమను దూషించారని మంజునాథ్ అనే యువకుడు ఆరోపించాడు. వారిపై దాడి చేయడానికి అదే వర్గంలోని తోటివారినీ పురికొల్పాడు. మరుసటి రోజు అంటే, 2014 ఆగస్టు 28వ తేదీన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మంజునాథ్ మరికొందరు గుమిగూడారు. ఎస్సీ కాలనీపై దాడి చేయడానికి ఇటుకలు, రాళ్లు, కర్రలతో బయల్దేరారు. కులం పేరుతో దూషిస్తూ ఎస్సీ కాలనీలోని గుడిసెలు, ఇళ్లపై దాడికి దిగారు. ఈ దాడిలో అనేక దళిత కుటుంబాలు భౌతికదాడికి గురయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా మూడు నెలలపాటు గ్రామంలో పోలీసులు నిఘా పెట్టారు.

దాడికి గురైన భీమేష్ అనే బాధితుడు గంగావతి రూరల్ పోలీసు స్టేషన్‌లో తర్వాతి రోజు ఫిర్యాదు చేశాడు. సుదీర్ఘమైన న్యాయపోరాటానికి సిద్ధపడ్డాడు. ఈ కేసులో కొప్పల్ జిల్లా, సెషన్స్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆ గ్రామంలో తరుచూ అగ్రవర్ణాలకు, దళితులకు మధ్య గొడవలు జరుగుతుండేవని జడ్జిమెంట్‌లో జస్టిస్ సీ చంద్రశేఖర్ రికార్డ్ చేశారు.

తీర్పు:

ఈ కేసులో 117 మందిపై అభియోగాలు నమోదవ్వగా 11 మంది నిందితులు విచారణ కాలంలో మరణించారు. ఇద్దరు మైనర్లను జువెనైల్ జస్టిస్ బోర్డు విచారించింది. మిగిలిన 98 మంది అగ్రవర్ణాలకు చెందిన దోషులకు జీవిత ఖైదు, రూ. 5 వేల జరిమానాను కొప్పల్ జిల్లా, సెషన్స్ కోర్టు విధించింది. దళితవర్గానికి చెందిన ముగ్గురికి ఐదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ. 2 వేల ఫైన్ వేసింది.

Advertisement

Next Story