వాజేడు ఆత్మీయ సమ్మేళనం.. తుమ్మల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..

by Rajesh |
వాజేడు ఆత్మీయ సమ్మేళనం.. తుమ్మల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..
X

దిశ, భద్రాచలం : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సన్మాన కార్యక్రమం సందర్భంగా చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2018 ఎన్నికల్లో పాలేరులో తుమ్మల ఓటమి అనంతరం పార్టీ పరంగా ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయిందని అభిమానులు మధనపడుతున్నారు. పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలనేది అభిమానుల కోరిక. మౌనం వీడి సరైన నిర్ణయం తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభిమానులు‌ తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నారు. అభిమానుల ఒత్తిడి మేరకే వాజేడు కేంద్రంగా అభిమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పాలేరు టిక్కెట్ ఇస్తుందా లేక మరోదారి వెతుక్కోవడమా అనేది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. కాంగ్రెస్, బీజేపీల నుంచి తుమ్మలకు ఆహ్వానం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో టీడీపీని బలోపేతం చేద్దామని అభిమానులు కోరుకుంటున్నారు.‌ జాప్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తుమ్మల చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనం పేరిట ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాలోని అభిమానులు అంతా వాజేడు వేదికగా గురువారం సమావేశం అవుతున్నారు. తుమ్మల రాజకీయంగా వేయబోతున్న అడుగుల గురించి ఆత్మీయ సమ్మేళనంలో అభిమానులకు క్లారిటీ ఇస్తారని అందరు ఎదురుచూస్తున్నారు.

భారీ కాన్వాయ్‌తో..

సుమారు 400 కార్లతో భారీ కాన్వాయ్‌‌గా గండుగులపల్లి నుంచి వాజేడు బయలుదేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి భద్రాచలం వంతెన వద్ద టీఆర్ఎస్ నాయకులు ఎస్ఏ రసూల్, మానె రామకృష్ణల నాయకత్వంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తుమ్మల భద్రాచలం రామాలయానికి వెళ్ళి పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి తుమ్మలకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం భద్రాచలంలో అల్పాహారం చేసిన తుమ్మల దుమ్మగూడెం చేరుకొని అక్కడ గోదావరిపై సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు ప్రోగ్రెస్ గురించి తెలుసుకున్నారు. సీతమ్మ సాగర్ రైతుల బీడు భూములను సస్యశ్యామలం చేస్తుందని అన్నారు. అక్కడి నుంచి చర్ల మండలానికి విచ్చేసి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ముంపు కోరెగడ్డ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూడాలని బాధిత రైతులు తుమ్మలని కోరారు. తదుపరి ఆయన చర్ల నుంచి బయలుదేరి వెంకటాపురం మీదుగా వాజేడుకి వెళ్ళారు.

తుమ్మల పర్యటనపై నిఘా వర్గాల ఆరా..!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్తుపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ నెలకొంది. తుమ్మల పర్యటనలో పార్టీ జెండాలు పెద్దగా కనిపించలేదు. ఆయన పార్టీలో ఉంటారా లేక మారుతారా అనేది అంతుచిక్కడం లేదు. దీంతో ఆయన్ని ఎవరు కలుస్తున్నారు. ఏమి మాట్లాడుతున్నారు. రాజకీయ అడుగులపై ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా అనేది ఎప్పటికపుడు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. వాజేడు వేదికగా తుమ్మల ప్రసంగం అభిమానులను ఉత్సాహపరుస్తుందా లేక నిరుత్సాహం కలిగిస్తుందా అనేది మరికొన్ని గంటలు వేచిచూడాలి.

Advertisement

Next Story

Most Viewed