Letter to CM : సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి లేఖ.. 2 ఎకరాల భూమి కేటాయించాలని విజ్ఞప్తి

by Ramesh N |   ( Updated:2024-08-24 13:38:54.0  )
Letter to CM : సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి లేఖ.. 2 ఎకరాల భూమి కేటాయించాలని విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎయిమ్స్ బీబీనగర్‌కు అనుబంధంగా అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (యూహెచ్‌టీసీ) ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరం నడిబొడ్డున 2 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం రేవంత్ రెడ్డికి లేఖలో కోరారు. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడానికి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మొదలుకొని అన్ని స్థాయిలలో ఆరోగ్య కేంద్రాల్లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులో ఉంచడానికి మోడీ సర్కార్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే అనేక రాష్ట్రాలలో ఎయిమ్స్ ఆసుపత్రులను మోడీ ప్రభుత్వం నెలకొల్పుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2019 లో బీబీనగర్ లో రూ. 1,300 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎయిమ్స్ బీబీనగర్‌లో ఓపీడీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, ఎయిమ్స్ మెడికల్ కాలేజీని కూడా కొత్తగా ఏర్పాటు చేయడం, ప్రస్తుతం వైద్య కళాశాల తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ఎయిమ్స్ నూతన భవనాలు చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ నగరంలో ఒక అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కేంద్రం ద్వారా వైద్య విద్యార్థులకు అవసరమైన బోధన & శిక్షణ కార్యక్రమాలను, నగరంలో నివశిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉంటుందని చెప్పారు.

ఎయిమ్స్ బీబీనగర్ ఎక్స్ టెన్షన్ కోసం హైదరాబాద్ నగరంలో తాత్కాలికంగా ఒక ప్రభుత్వ భవనాన్ని కేటాయిస్తే, అక్కడ ఎయిమ్స్ బీబీనగర్ కు అనుబంధంగా అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, నగరంలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను వెంటనే అందుబాటులోకి తీసుకు వస్తుందన్నారు. అలాగే నగరం నడిబొడ్డున 2 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తే అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్‌కు శాశ్వత భవనాన్ని నిర్మాణం చేయడానికి ఎయిమ్స్ బీబీనగర్ సిద్ధంగా ఉందన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల డిప్యూటీ డైరెక్టర్, ఎయిమ్స్, బీబీనగర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ విషయంపై సీఎం ప్రత్యేకమైన దృష్టిసారించి ఎయిమ్స్ అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్‌కు శాశ్వత భవన నిర్మాణాన్ని చేపట్టడానికి హైదరాబాద్ నగరంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా 2 ఎకరాల భూమిని కేటాయించాలని, అంతవరకూ తాత్కాలికంగా అందుబాటులో ఉన్న ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించి ట్రైనింగ్ సెంటర్ సేవలను వెంటనే ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకరించాలని లేఖలో కోరారు.

===

Advertisement

Next Story

Most Viewed