సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

by GSrikanth |   ( Updated:2023-04-03 07:57:19.0  )
సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వమిత్వ పథకం గురించి సోమవారం సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కిషన్ రెడ్డి లేఖ కోరారు. దీనిపై గత సంవత్సరం జూలై29న తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖను రాసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంలో సీఎం కేసీఆర్ చొరవ చూపించాలని కోరారు. గ్రామీణ భారతదేశంలోని ప్రజలకు వారి గృహాలకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించి, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021 ఏప్రిల్ 24, “సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాది & మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వమిత్వ)” పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారని తెలిపారు.

ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించటానికి ముందే హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టు కింద విజయవంతంగా అమలుచేయటం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలోను ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తైన సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ 29 జూలై, 2022న కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖను రాసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కావున ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చే గృహాల సర్వేకు సంబంధించిన ఈ స్వమిత్వ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Read more:

బీఆర్ఎస్‌కు ఎన్నికల అస్త్రంగా పోడు భూముల సమస్య!

Advertisement

Next Story

Most Viewed