సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-06-22 12:54:16.0  )
సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై కేంద్రమంత్రి, టీ-బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారం అంతా పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సింగరేణి వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధ్వంసం చేశారని.. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నేతలు సింగరేణిపై విచిత్ర వాదన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి సింగరేణి బ్యాంక్ ఖాతాలో రూ.3500 కోట్ల మిగులు ఫండ్స్ ఉన్నాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని అప్పుల పాలు చేశారని అన్నారు.

2014కు ముందు సింగరేణిలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని, బీఆర్ఎస్ పవర్‌లోకి వచ్చిన తర్వాతే ఉద్యోగులకు లేట్‌గా జీతాలు అందుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి రూ.30 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయలేదని, ఈ కారణంగా సింగరేణికి బకాయిలు పేరుకుపోయాయని సింగరేణి అప్పులపై క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వల్లే సింగరేణి అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. సింగరేణిపై కేసీఆర్‌ది మొసలి కన్నీరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం బాగా పెరిగిపోయిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా సింగరేణిని దోచుకున్నారని నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed