సెక్రటేరియట్ ప్రారంభం వేళ కేసీఆర్‌పై కిషన్ రెడ్డి సీరియస్

by GSrikanth |
సెక్రటేరియట్ ప్రారంభం వేళ కేసీఆర్‌పై కిషన్ రెడ్డి సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లుగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇచ్చింది లేదని, అదే సెక్రటేరియట్ మాత్రం నాలుగు నెలల్లో కట్టుకున్నారని, పేదలను మోసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సనత్ నగర్‌లో ‘మన్ కీ బాత్’ వీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్, ముఖ్యమంత్రి వెళ్ళని సచివాలయం ఎందుకని ఆయన ఘాటు విమర్శలు చేశారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవంలో కొన్ని మీడియా సంస్థలపై ఆంక్షలు విధించడం సరికాదని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమం సమయాల్లో మీడియా సంస్థలను వాడుకొని ఇప్పుడు ద్వేషించడం మంచి పద్దతి కాదని కోపోద్రిక్తులయ్యారు. నిజాం రాచరిక ఆలోచనలతో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్.. గతంలోను టీవీ9, వీ6, ఏబీఎన్ చానల్స్‌ను నిషేధించారని, 10 కిలోమీటర్ల లోతు భూమిలో పాతిపెడతానన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. 2016 నుంచి సెక్రటేరియట్‌కు రాకుండా పాలన సాగించారని, అలాంటిది వెళ్లేందుకు అవకాశం లేని ప్రగతి భవన్, సీఎం రాని సచివాలయం ఎందుకని కిషన్ రెడ్డి నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed