సోలార్ ప్రాజెక్ట్‌కు సర్వం సిద్ధం.. ఫస్ట్ ఫేజ్‌లో 5 జిల్లాల్లో ప్లాంట్లు

by karthikeya |   ( Updated:2024-11-19 02:54:45.0  )
సోలార్ ప్రాజెక్ట్‌కు సర్వం సిద్ధం.. ఫస్ట్ ఫేజ్‌లో 5 జిల్లాల్లో ప్లాంట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సోలార్ పైలట్ ప్రాజెక్టుగా నర్సాపూర్‌ను ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. దానితో పాటు మరో రెండు జిల్లాల్లో సైతం భూమిని పరిశీలించినట్టు తెలిసింది. అయితే, ప్రభుత్వం మాత్రం నర్సాపూర్‌లోనే సోలార్ ప్లాంట్ నిర్మించేందుకు మొగ్గుచూపినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని కొన్ని దేవాలయాలకు చెందిన 719.12 ఎకరాలను ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. తొలి విడతలో 231 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు సర్కారు అడుగులు వేస్తున్నది. త్వరలో పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవో రిలీజ్ కానున్నట్టు సమాచారం.

పైలట్ ప్రాజెక్టు‌గా నర్సాపూర్ ఫైనల్!

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేవాలయాల భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఆ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించబోతున్నది. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక అభ్యున్నతితో పాటు ఉపాధికి భరోసా లభించనున్నది. అయితే, సోలార్ పవర్ ప్లాంట్‌ను తొలుత ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దేవాదాయశాఖ అధికారులతో పాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు సేకరిస్తున్నది. మెదక్ నియోజకవర్గంలోని నర్సాపూర్ లక్ష్మీ నారాయణస్వామి టెంపుల్‌కు 127.37 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి 2 కి.మీ. పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది. ఈ ల్యాండ్‌లో 100 ఎకరాల్లో ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. నర్సాపూర్ పైలట్ ప్రాజెక్టు‌గా ఎంపిక దాదాపు ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం.

భుజలాపురం, రంగన్నదర్వాజలో ల్యాండ్స్ పరిశీలించిన ఆఫీసర్లు

తొలి ప్రాజెక్టు సక్సెస్ అయితే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే అన్ని వివరాలు సేకరించిన తర్వాతే నర్సాపూర్ విషయమై తుది నిర్ణయానికి సర్కారు వచ్చినట్టు తెలిసింది. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మండలం భుజలాపురంలో గల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 20.33 ఎకరాల భూమి ఉండగా, అందులో 15.33 ఎకరాల ల్యాండ్‌లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలంలోని రంగన్న దర్వాజ‌లో గల సీతారామచంద్రస్వామి ఆలయానికి 24.17 ఎకరాలు ఉండగా, 21.34 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు‌కు గుర్తించారు. ఒక వేళ నర్సాపూర్ ఎంపిక కాకపోతే ఈ రెండు ప్రాంతాల్లోని ఒక ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్టు సమాచారం. అందుకోసం ఆఫీసర్లు సైతం ఈ ల్యాండ్స్‌ను పరిశీలించినట్టు తెలిసింది. పైలట్ ప్రాజెక్టు కోసం ముమ్మర కసరత్తు మొదలుకావడంతో త్వరలోనే అధికారికంగా సర్కారు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం.

టెంపుల్ ల్యాండ్స్‌పై సర్కారుకు ఆఫీసర్ల రిపోర్టు!

రాష్ట్రంలో సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందుకోసం దేవాదాయశాఖ అధికారులు హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆలయ భూములను గుర్తించారు. హైదరాబాద్(సికింద్రాబాద్)లో 32.26 ఎకరాలు, మెదక్ జిల్లాలో 109.06 ఎకరాలు, నల్లగొండ (యాదాద్రి భువనగిరి)లో 26.33 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 356.34 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 33.17 ఎకరాలు, కరీంనగర్‌లో 21.31 ఎకరాలు, వరంగల్‌లో 26.34 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 96.36 ఎకరాలు, నిజామాబాద్‌లో 14.35 ఎకరాలను ఆఫీసర్లు ఐడెంటిఫై చేశారు. ఇందులో సబ్ స్టేషన్లు 2 కి.మీ. దూరంలో ఉన్న టెంపుల్ ల్యాండ్ 292.24 ఎకరాలు, 3 కి.మీ. పరిధిలో 399.36 ఎకరాలు, 4 కి.మీ. దూరంలో 11 ఎకరాలు, 5 కి.మీ. దూరంలో 15.32 ఎకరాలు ఉన్నట్టు ఆఫీసర్లు సర్కారుకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం.

ఫస్ట్ ఫేజ్‌లో 5 జిల్లాల్లో ప్లాంట్లు

తొలి విడతలో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో(సిద్దిపేట, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ) 284.09 ఎకరాలు ఆలయ భూములు ఉండగా, 231.05 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. విద్యుత్ సబ్ స్టేషన్లకు 2 కి.మీ. సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములనే తొలి విడతగా ఎంపిక చేశారు. ఈ భూముల్లోనే దశలవారీగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు ఆఫీసర్లు తెలిపారు.

ఇంధన శాఖ పర్మిషన్ వచ్చాకే ప్లాంట్ ఇన్‌స్టాలేషన్

ఆలయ భూములను స్వశక్తి మహిళా సంఘాలకు లీజుకు ఇచ్చి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేలా ప్రోత్సహించాలని సర్కారు అనుకుంటోంది. దీంతో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, మరోవైపు ఆలయాలకు సైతం ఇన్‌కమ్ సమకూరుతుందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఒక్క మెగా వాట్ ప్లాంట్‌కు రూ.3 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో మహిళా సంఘాలు 10 % కాంట్రిబ్యూట్ చేస్తే.. 90 % బ్యాంకు ద్వారా లోన్లు మంజూరు చేయనున్నారు. ఇంధన శాఖ నుంచి అనుమతులు రావడమే తరవాయి వారం రోజుల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఒక్క మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తిపై ఏడాదికి రూ.30 ల‌క్షల ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా. సోలార్ ప్లాంట్లకు ఇంధ‌న శాఖ నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే మ‌హిళా సంఘాల‌కు భూములకు లీజ్ ఇవ్వడంతో పాటు రుణాలు మంజూరు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటి వరకు బ్యాంకులు మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాయి. ఒక్క మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 కోట్లు వ్యయం అవుతుండటంతో.. రూ.5 లక్షల గరిష్ట పరిమితి మించుతుండటంతో వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేస్తున్నారు. సాంకేతికంగా సాధ్యం కాని పక్షంలో వడ్డీలో రాయితీ కల్పించాలని, అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన భూముల్లో ఎకరాకు ఎంత లీజు ఇవ్వాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. అందుకోసం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. తక్కువ లీజుకు ఇచ్చి మహిళా సంఘాలను ప్రోత్సహించాలని ఇప్పటికే సర్కారు నిర్ణయించడంతో లీజు అమౌంట్‌పై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed