వరద బాధితులను కేంద్రం ఆదుకుంటుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ

by Gantepaka Srikanth |
వరద బాధితులను కేంద్రం ఆదుకుంటుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ
X

దిశ, ఖమ్మం సిటీ: మున్నేరు వరద బాధితులకు భరోసా ఇవ్వడానికి బీజేపీ కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో మున్నేరు వరద బాధితులను పరమర్శించేందుకు ఆయన ఆదివారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించారు. నగరంలోని దంసలాపురం, రాకాసి తండా, గ్రామాల్లో తిరిగి బాధితులతో మాట్లాడారు. అనంతరం ఓ పక్షన్ హాల్లో బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. ఇల్లు కోల్పోయిన వారికి వసతి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదల్లో కోల్పోయిన సామాగ్రి, పుస్తకాలు సర్టిఫికెట్స్ అన్నీ వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వరద భాదితులు సహాయం కొంత వేగవంతం చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా వరద బాధితులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ పరిశీలకులను పంపించి నష్టం అంచనా వేశారని వారికి సహాయం అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ముందుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్డీఎఫ్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలన్నారు. 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ నిధులు విపత్తు సమయంలో వాడుకోవడం కోసం కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదలకు కొన్ని నిబంధనలు ఉంటాయని వాటికి లోబడి రిపోర్ట్ రాగానే కేంద్రం తప్పకుండా సహాయం చేస్తుందన్నారు. ఈ విపత్తు సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహాయం అందించాలని కోరారు. వాస్తవంగా ప్రజలు చాలా ప్రాంతాల్లో తమ సర్వస్వం కోల్పోయారు. వారు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేవరకు పూర్తిగా ఆదుకోవాలి.. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయన్నారు. వరద నష్టానికి సంబంధించి ప్రధాని, కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రితో, మంత్రులతో చర్చించడం జరిగిందన్నారు. అన్నీ విధాలా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed