BRS నేతలు భూములు దండుకోవడం కోసమే ధరణి పోర్టల్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |
BRS నేతలు భూములు దండుకోవడం కోసమే ధరణి పోర్టల్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి లోపాలను ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వమే భూములను కబ్జా చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములను సైతం కబ్జా వదలట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని, కానీ ఆ పోర్టల్ కారణంగానే నేడు లక్షలాది మంది రైతులు, భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టడంతో లక్షలాది మంది ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు.

ఈ పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని, దండుకోవడమే లక్ష్యంగా ఇదంతా సాగుతోందన్నారు. సామాన్యులకు మరో ప్రత్యామ్నాయం లేక దళారీల ఉచ్చులో పడుతున్నారని, హైకోర్టును ఆశ్రయించడం తప్ప ఎవరిని కలిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనేది తెలియడం లేదన్నారు. పాస్ పుస్తకంలో తప్పులను సరిదిద్దేందుకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. గతంలో ఈ పోర్టల్ ద్వారా నిమిషాల్లో మ్యూటేషన్ జరిగిపోతుందని, అవినీతి ఉండదని, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాల్సిన పని లేదని కేసీఆర్ చెప్పారని, కానీ నేడు దానికి విరుద్ధంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.

ధరణి పోర్టల్ నుంచి ఎలాంటి చిన్న మార్పు చేయాలన్నా ప్రగతిభవన్ నుంచే చేపడుతున్నారన్నారు. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే భూ సంబంధిత సమస్యలు పరిష్కారమయ్యేవని, కానీ నేడు ప్రగతిభవన్ వరకు అది వచ్చిందంటే ప్రభుత్వం ఎంత మేరకు ఆక్రమణలకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చని ఆరోపణలు చేశారు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం దోచిపెడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు ప్రజాప్రతినిధులు, రియల్ వ్యాపారులు కుమ్మక్కై ప్రజల నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములను విక్రయాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ధరణిలో తప్పొప్పుల సవరణ కూడా జరగకపోవడంతో ప్రభుత్వ పథకాలు, ఇతర స్కీమ్‌లు సామాన్యులకు చేరడం లేదని, వాటిని బీఆర్ఎస్ నేతలు గద్దల్లా తన్నుకుపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

బ్రోకర్లను పెంచి పోషిస్తున్నట్లుగా ధరణి పోర్టల్ ఉందని గతంలో న్యాయస్థానాలు చెప్పాయని ఆయన గుర్తుచేశారు. రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు అందించిన దరఖాస్తులు ఏమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధరణి పోర్టల్ బాగానే ఉంటే సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేసినట్లని ఆయన ప్రశ్నించారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ధరణిపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వం ఆమోదించిందా? తిరస్కరించిందా? అనేది చెప్పాలన్నారు. ప్రగతిభవన్‌లో అవినీతి, అక్రమాలకు ఆలోచన చేసే వ్యక్తులు ఇచ్చే సలహాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు తప్పితే కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను అమలుచేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. కుటుంబ, అవినీతి, అక్రమ, నియంతృత్వం లేని ప్రజాస్వామ్య పాలనను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కారు స్టీరింగ్ తన చేతిలోనే ఉందని గతంలోనే ఒవైసీనే చెప్పారని, తాను బ్రేకులు వేస్తేనే ఆగుతుంది.. తాను యాక్సిలరేటర్ ఇస్తేనే ముందుకు పోతుందని అన్న విషయాలను ఆయన గుర్తుచేశారు. రాజాసింగ్ సెక్రటేరియట్‌కు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేను అడ్డుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి సామాన్యులను లోనికి పంపించడం లేదని ఆయన ఫైరయ్యారు. పాతబస్తీలో ఓ పోలీస్, ఓ ప్రభుత్వ అధికారి ధైర్యంగా వెళ్లే పరిస్థితి కనిపించడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎంతసేపు ఫోన్లు ట్యాప్ చేయడం, ధర్నాలు చేసేవారిని అడ్డుకోవడం వంటి పనులు మాత్రమే చేస్తోందని ధ్వజమెత్తారు. వాస్తవానికి తెలంగాణ పోలీసుల చాలా ధైర్యవంతులని, కానీ వారిని కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed