తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా: కేంద్రమంత్రి

by GSrikanth |
తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా: కేంద్రమంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కుటుంబ పాలనతో తెలంగాణ దగా పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అశువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు, ఆకాంక్షలు నేరవేరాల్సి ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ మాఫియా కొనసాగుతోందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. పదేళ్లలో తెలంగాణగా అప్పుల కుప్పగా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. మత పరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమకారుల గొంతు కోసి, ఉద్యమ ద్రోహులకు సీఎం కేసీఆర్ తెలంగాణాను అప్పజెప్పారన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోసం 111 జీవోను రద్దు చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. కొంతమంది ఎమ్మెల్యేలు మాఫియాగా మారి దళితుల నోటికాడి కూడును లాక్కుoటున్నారని ఘాటు విమర్శలు చేశారు.

తెలంగాణలో వైద్యారోగ్యం పూర్తిగా కుంటుపడిపోయిందని మండిపడ్డారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి రాడు.. ఇతరులను రానివ్వడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు పనికిరాని సచివాలయం ఎందుకని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సంక్షేమ పథకాలతో అవినీతి భారీగా పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. మూడు లక్షల కోట్లకు పైగా అప్పుల్లో తెలంగాణ ఉందని ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.లక్షా 30 వేల కోట్ల అప్పు తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ప్రతి ఏడాది రైతులు నష్టపోతున్నారని, నోటి కాడి కూడు వరద పాలవుతోందని అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కిసాన్ బీమా తెలంగాణలో అమలుచేయడం లేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు. తెలంగాణలో నీతివంతమైన పరిపాలన రావాల్సి ఉందని, అందుకు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని ఆయన కోరారు. తనది రాజకీయ ఉపన్యాసం కాదని, తెలంగాణ ప్రజల గొంతులో రగులుతున్న ఆవేదన అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story