రాముడిపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-03-01 16:59:24.0  )
రాముడిపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన తార్నాక, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాంనగర్‌లో నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంనగర్ చౌరస్తాలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ అని, ఆ పార్టీకి భవిష్యత్ లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ప్రజల భూములు దోచుకుందని, ఇసుక ద్వారా, లిక్కర్ ద్వారా దోచుకున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదని ఆయన ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు బిల్డర్లు, వ్యాపారుల నుంచి ముక్కుపిండి రాహుల్ గాంధీ టాక్స్‌లు వసూలు చేసి వాటిని ఢిల్లీకి పంపిస్తున్నారని ఫైరయ్యారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై పడి దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. సిక్స్ గ్యారంటీస్ అమలు చేయకుండా గారడీలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్‌ను కనుమరుగు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు రాముడిపై నమ్మకం లేదని, అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను ఆ పార్టీ బహిష్కరించిందని, కాబట్టి.. కాంగ్రెస్‌ను ప్రజలు అలాగే బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు మాత్రమే చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కాంగ్రెస్ దగ్గర లేదని ధ్వజమెత్తారు.

నేటి నుంచి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 15వ ఎడిషన్‌లో భాగంగా.. మార్చి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులో పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ జాతీయస్థాయి సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ఇతివృత్తంతో.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటుగా తర్వాతి తరాలకు అందించేలా కార్యక్రమాలు నిర్వహించడమే రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

ఈ సాంస్కృతిక వేడుకల చివరి రోజు కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘శారీ వాకథాన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నగ్తు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ‘శారీ వాకతాన్’ కార్యక్రమంలో దేశ సాంస్కృతిక వైవిధ్యతను తెలియజేసేలా దేశంలోని వివిధ ప్రాంతాల మహిళలు.. వారి ప్రాంతాల్లో ధరించే చీరకట్టుతో తమ ప్రాంతాల్లోని సంస్కృతిని ప్రతిబింబింపజేస్తారన్నారు.

Read More..

త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్‌: CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Advertisement

Next Story