సింగరేణిని బీఆర్ఎస్ జేబు సంస్థగా మార్చుకుంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Javid Pasha |   ( Updated:2023-04-19 10:11:31.0  )
సింగరేణిని బీఆర్ఎస్ జేబు సంస్థగా మార్చుకుంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: సింగరేణిని బీఆర్ఎస్ జేబు సంస్థగా మార్చుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి పరిస్థితినేడు అగమ్యగోచరంగా తయారైందని, రూ.3,500 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న సింగరేణిని కేసీఆర్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని మండిపడ్డారు. టీఎస్ జెన్కో నుంచి రూ.2500 కోట్లు, టీఎస్ ట్రాన్కో నుంచి రూ.18000 కోట్లు సింగరేణికి రావాల్సి ఉందన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.25 వేల కోట్ల వరకు సింగరేణికి రావాలని స్పష్టం చేశారు. బొగ్గు గనులు తెలంగాణలో వేలం వేస్తుంటే అందులో పాల్గొని సింగరేణికి గనులు దక్కేలా చేయకుండా.. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు పెడతామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ఏవిధంగా తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామంటూ ప్రకటించడం రాజకీయ జిమ్మిక్కు మాత్రమేనని కొట్టిపారేశారు. కార్మికులకు దేవుళ్ళమంటూ కల్వకుంట్ల కుటుంబం పొలిటికల్ స్టంట్ చేస్తున్నారన్న మంత్రి.. కోల్ ఇండియా లో కార్మికులకు 930 రూపాయలు వేతనం ఉంటే సింగరేణిలో 420 మాత్రమే ఉందని గుర్తు చేశారు. కార్మిక సంఘాల ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు సింగరేణి ఉద్యోగులు గుర్తుకువస్తారని, మామూలు సందర్భాల్లో అసలు వాళ్ల గురించి పట్టించుకోరని ఆరోపించారు. 2014,18,19 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సొంత ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదని అన్నారు.

అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్, అధ్వానమైన ఆర్థిక వ్యవస్థ, సిబ్బంది తగ్గింపు, గనులలో భద్రత లోపంతో సింగరేణిని భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో బీఆర్ఎస్ నాయకుల జోక్యం ఎక్కవైందన్న ఆయన.. కనీసం షిఫ్టుల మార్చే స్వేచ్ఛ కూడా సింగరేణి అధికారులకు లేదని అన్నారు. అధికార దుర్వినియోగానికి సింగరేణి యాజమాన్యం రెడ్ కార్పెట్ వేసిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లు సింగరేణి అధికారులు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని కేంద్రప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీయే సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం లేదని చెప్పారని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed