తెలంగాణ స్టేట్ బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సెటైర్.. ఏమన్నారంటే..?

by Satheesh |   ( Updated:2024-07-25 10:39:19.0  )
తెలంగాణ స్టేట్ బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సెటైర్.. ఏమన్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమని మాస్ సెటైర్ వేశారు. డిప్యూటీ సీఎం భట్టి (ఆర్థిక శాఖ మంత్రి కూడా) చదివింది బడ్జెట్టా లేదా అప్పుల పత్రమా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఐదేళ్లలో అమలు చేయడం అసాధ్యమని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదని అసహనం వ్యక్తం చేసిన బండి.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని ఆరోపిస్తున్న సీఎం, మంత్రులు.. స్టేట్ బడ్జెట్‌లో ఒక్క నియోజకవర్గం పేరు లేనందుకు గానూ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం ఎలా సమకూర్చుకుంటారో ప్రభుత్వం బడ్జెట్‌లో చూపించలేదని.. మరీ ఇన్‌కమ్ కోసం ప్రభుత్వ భూములన్నీ అమ్మాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. హామీల అమలు చేతకాదని కాంగ్రెస్‌కు చేతకాదని బడ్జెట్ చూస్తే తెలుస్తోందన్నారు. హిందువుల పండుగలకు పైసా ఇవ్వకపోవడం మతతత్వం కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, రూ.2,91,159 కోట్ల అంచనాతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story