- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణపై అమిత్ షా స్పెషల్ ఫోకస్.. అధికారమే లక్ష్యంగా కీలక నిర్ణయం!
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో అడ్డా వేయనున్నారు. కర్ణాటక ఎన్నికల అనంతరం తన మకాం తెలంగాణకు మార్చనున్నారు. పూర్తిస్థాయిలో తన దృష్టిని ఇక్కడే కేంద్రీకరించనున్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రానికి నెలకోసారి పర్యటిస్తానని చెప్పిన అమిత్ షా కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడే మకాం వేయనుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. కర్ణాటక ఎన్నికలు మే నెలలో జరగనున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయ్యేనాటికి ఆయన నిత్యం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అవి పూర్తయిన వెంటనే ఫుల్ ఫోకస్ తెలంగాణపై పెట్టనున్నారు. వచ్చే ఎన్నికలు ఎంతో హోరాహోరీగా జరుగుతాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న కమలం పార్టీ.. కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ఇదే మంచి అవకాశమని, ఈసారి అవకాశాన్ని చేజార్చుకోకూడదని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో ఇలాంటి చాన్స్ మళ్లీ మళ్లీ రాదని కాషాయదళం డిసైడ్ అయింది. అందుకే జాతీయ నేతల వరుస పర్యటనలు తెలంగాణలో నిత్యం కొనసాగుతున్నాయి.
తెలంగాణలో ప్రతినెలా ఒక అగ్ర నేత పర్యటన కొనసాగేలా కాషాయదళం రూట్ మ్యాప్ ఫిక్స్ చేసుకుంది. అందులో ప్రధాని మోడీ సహా, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలు ఉంటాయనేది తెలిసిన విషయమే. కాగా ఇటీవల ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటుచేసిన సభ అనంతరం తిరిగి వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదాపడింది. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 12న చేపట్టబోయే పర్యటనతో కేవలం ఒక్క నెల వ్యవధిలోనే తెలంగాణకు చెందిన నేతలతో మూడు మీటింగులు పూర్తిచేయనున్నారు. గత నెల నేషనల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన షా నొవాటెల్‌లో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మొన్నటికి మొన్న ఢిల్లీలోని షా కార్యాలయం నుంచి తెలంగాణ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులకు కాల్ రావడంతో నేతలు హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. కాగా ఈనెల 12వ తేదీన తెలంగాణకు రానున్న ఆయన మరోసారి నేతలతో భేటీకానున్నారు. అదేరోజు సంగారెడ్డిలో మేధావుల సదస్సుకు హాజరుకానున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివరించడమే కాకుండా తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అనుకున్న లక్ష్యాలకు చేరుకున్నామా? బాగుపడింది ఎవరు? కేసీఆర్ సర్కార్ చేస్తున్న మోసాలు వంటి అంశాలపై ఈ సదస్సు సాగనున్నట్లు సమాచారం.
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే విషయంలో కమలనాథులు చాలా సీరియస్‌గా ఉన్నారు. అందుకే దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను ఫిక్స్ చేసుకున్న కాషాయదళం పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టి అధికారంలోకి రావడంపై కసరత్తులను ముమ్మరం చేసింది. ఇప్పటికే తెలంగాణలో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతల టూర్లు నిత్యం కొనసాగుతున్నాయి. ఏదో ఒక యాక్టివిటీతో నిత్యం ప్రజల్లో ఉండటంపై కాషాయదళం దృష్టిసారిస్తోంది. పార్లమెంట్ ప్రవాస్ యోజన పేరిట ఇప్పటికే కేంద్ర మంత్రులు నిత్యం ఏదో ఒక పార్లమెంట్ పరిధిలో పర్యటనలు చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్‌కు చేరువయ్యేందుక పలు వ్యూహాలు అమలు చేసింది. అలాగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌తో బూత్ స్థాయికి చేరువయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ తరుణంలో కర్ణాటక ఎన్నికల తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు మకాం మార్చనుండటం బీజేపీలో జోష్ ను నింపనుంది. నేతలు, కార్యకర్తలు మరింత కష్టపడి పనిచేసేందుకు బూస్ట్ లా పనిచేయనుందని రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్య వరకు బీజేపీ జాతీయ నేతల వరుస పర్యటనలు నిత్యం కొనసాగుతాయని స్పష్టమవుతోంది. మరి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి అమిత్ షా, జాతీయ నేతల మకాం వేయడం ఎంత వరకు కలిసొస్తుందనేది చూడాల్సి ఉంది.