అధికార పార్టీలో అసంతృప్త జ్వాలలు.. అధిష్టానానికి ఇద్దరు మంత్రులు ఫిర్యాదు

by GSrikanth |
అధికార పార్టీలో అసంతృప్త జ్వాలలు.. అధిష్టానానికి ఇద్దరు మంత్రులు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల పంచాయితీ నడుస్తున్నది. ఏకపక్షంగా పోస్టులు కట్టబెట్టారని కొందరు మంత్రులు ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ కోసం పనిచేస్తున్న లీడర్లను పక్కన పెట్టి, కొత్తగా వచ్చిన వలస నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కంప్లయింట్‌లో పేర్కొన్నట్టు టాక్. సామాజిక న్యాయం పాటించలేదని కొందరు లీడర్లు గుర్రుగా ఉన్నారు. తమ అనుచరులకు ప్రయారిటీ లేని పోస్టులు ఇచ్చారని అసంహనం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

ఇద్దరు మంత్రులు గుస్సా

నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఉత్తర తెలంగాణ‌కు చెందిన ఇద్దరు మంత్రులు సీరియస్‌గా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి పదవి అనుభవించిన ఓ లీడర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సదరు లీడర్‌కు ఓ మంత్రి అండదండలు ఉండటంతో కీలక నామినేటెడ్ పదవి దక్కడం ఆ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పార్టీలో మొదటి నుంచి ఉన్న లీడర్లను పక్కన పెట్టి, కొత్తగా వచ్చిన వ్యక్తికి కీలక పదవి ఎలా ఇచ్చారనే చర్చ నడుస్తున్నది. ఇదే విషయంపై ఇద్దరు మంత్రులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు టాక్.

ఉమ్మడి నల్లగొండలో జూనియర్ లీడర్‌కు ప్రయారిటీ?

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ నాయకుడికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. దీనిపై దక్షిణ తెలంగాణ‌కు చెందిన ఓ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, వారికి కాదని జూనియర్ నేతకు అంతటి కీలక పదవి ఇవ్వడం ఏంటని సీరియస్ అయినట్టు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కొందరు లీడర్లు తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

ఒకేవర్గానికి ప్రయారిటీ?

పదవుల పంపకంలో సామాజిక సమతుల్యత పాటించలేదని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్లకే పోస్టులు ఇచ్చారని పలువురు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ సామాజిక వర్గానికి ఎన్ని పదవులు ఇచ్చారనే వివరాలను కొందరు లీడర్లు ఢిల్లీ పెద్దలకు పంపినట్టు టాక్. ‘నామినేటెడ్’ పదవుల విషయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.

Advertisement

Next Story