ఆలస్యంగా నిద్ర లేచిన ఆర్టీఏ.. విద్యాసంస్థలు మొదలయ్యాక బస్సులపై స్పెషల్ డ్రైవ్

by Javid Pasha |   ( Updated:2023-06-12 15:07:38.0  )
ఆలస్యంగా నిద్ర లేచిన ఆర్టీఏ.. విద్యాసంస్థలు మొదలయ్యాక బస్సులపై స్పెషల్ డ్రైవ్
X

దిశ , తెలంగాణ క్రైం బ్యూరో: రవాణా శాఖ అధికారులు నిద్ర లేచారు. స్కూళ్లు, కాలేజీల బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు ప్రారంభమైన సోమవారం వేర్వేరు చోట్ల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఫిట్నెస్ లేని కొన్ని బస్సులను సీజ్ కూడా చేసారు. ఇంతవరకు బాగానే ఉన్నా తీరా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన తర్వాత తనిఖీలు చేస్తుండటంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనేదో వేసవి సెలవుల్లో పూర్తి చేస్తే బాగుండేదని అంటున్నారు. ఇప్పుడు బస్సులు సీజ్ చేస్తుండటంతో తమ పిల్లలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న ప్రకారం రాష్ట్రం మొత్తం మీద ఇరవై అయిదు వేలకు పైగా స్కూల్, కాలేజీ బస్సులు ఉన్నాయి. వీటిలో కనీసం ఇరవై శాతం బస్సులకు ఫిట్నెస్ సరిగ్గా లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? లేదా? అన్నది తనిఖీ చేస్తున్నారు.

వాహనాల ఇంజన్ కండిషన్ పరీక్షిస్తున్నారు. టైర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అని చూస్తున్నారు. అదే సమయంలో డ్రైవర్లకు లైసెన్స్ లు ఉన్నాయా? లేవా? అన్నది చెక్ చేస్తున్నారు. సోమవారం ఉదయం రాజేంద్రనగర్ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి మూడు బస్సులను సీజ్ చేసారు. ఇబ్రహీంపట్నం వద్ద కూడా విస్తృత తనిఖీలు నిర్వహించి కొన్ని బస్సులను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల రక్షణ కోసం రవాణా శాఖ అధికారులు చేపట్టిన ఈ డ్రైవ్ పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నా చాలా మంది తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. తమలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో తమ తమ పిల్లల కోసం స్కూల్ కాలేజీ బస్సులను మాట్లాడుకున్నట్టు చెబుతున్నారు. సంవత్సరానికి వేలకు వేలు ట్రాన్స్పోర్ట్ ఫీజులు కడుతున్నామంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తీరా విద్యా సంస్థలు మొదలయ్యాక తనిఖీలు చేపట్టి బస్సులను సీజ్ చెయ్యటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

సెలవుల్లో ఏం చేశారు?

నిజంగా రవాణా శాఖ అధికారులకు విద్యార్థిని, విద్యార్థుల భద్రతపై చిత్తశుద్ధి ఉండి ఉంటే వేసవి సెలవుల్లో ఫిట్నెస్ డ్రైవ్ చేపట్టి ఉండాల్సిందని తల్లిదండ్రులు అంటున్నారు. అప్పుడు చేసి ఉన్నట్టయితే అధికారులు రోడ్ల మీదకు వచ్చే అవసరం కూడా ఉండేది కాదన్నారు. బస్సులన్నీ ఆయా విద్యా సంస్థల క్యాంపస్ లలో అందుబాటులో ఉండేవని అన్నారు. ఫిట్నెస్ తనిఖీలు కూడా సమగ్రంగా జరిగి ఉండేవని చెబుతున్నారు. అప్పుడు నిద్రపోయి విద్యా సంస్థలు మొదలయ్యాక స్పెషల్ డ్రైవ్ పేర హడావుడి చెయ్యటం ఏందో తమకు అర్థం కావటం లేదన్నారు. ఇప్పుడు బస్సులు సీజ్ చేస్తే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లటానికి పిల్లలు.. వారిని దించి రావటానికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.

Also Read..

రాజాసింగ్కు షాక్.. గోషామహల్ నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ?

Advertisement

Next Story