బీజేపీలోకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే? న్యూజిలాండ్‌లో సెటిల్మెంట్

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-28 03:20:50.0  )
బీజేపీలోకి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే? న్యూజిలాండ్‌లో సెటిల్మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ కుమార్‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా గత నెల 22న హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు అందినట్లు ప్రచారం సాగుతోంది. మనీ లాండరింగ్‌లో ఆ ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లు, వీరందరూ న్యూజిలాండ్‌లో కలిసి మాట్లాడుకున్నట్లు జోరుగా జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఎమ్మెల్యే ముందస్తుగా ఓ కేంద్ర మంత్రితో చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. ఆ చర్చల్లో ఎమ్మెల్యే సమయం వచ్చినప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే కలెక్టరేట్​ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ కు జనాలు తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యే పలుమార్లు బీజేపీతో చర్చలు సాగించి అనుకున్న స్థానాన్ని రిజర్వ్​ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలను ఓ కేంద్ర మంత్రి సేవ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతారని ప్రచారం కూడా ఊపందుకుంది.

టీఆర్ఎస్‌ను వరుస ఘటనలు కుదిపేస్తున్నా యి. ఓవైపు అవినీతి ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరో వైపు ఏకంగా కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సంచలన క్యాసినో నిర్వాహకుడు చీకొటి ప్రవీణ్‌తో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈడీ భయం పుట్టుకుంది. అయితే హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారనే ప్రచారం సాగుతుంది. ఆ నోటీసులకు ఆ ఎమ్మెల్యేలు కూడా అంతర్గత రిప్లే ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈడీ నోటీసులు వస్తే నేరుగా ఈడీ ఆఫీస్​కు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ సాధారణంగా రిప్లే ఇస్తే ఉపేక్షిస్తారా.. లేదా అనే అనుమానం కూడా ఉంది. ఇదంతా ఓ కేంద్ర మంత్రి రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈడీ కేసును కూడా జాప్యం చేస్తున్నారంటే.. కచ్చితంగా బీజేపీలోకి ఆ ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే ఉహాగానాలు ఉపందుకున్నాయి.

మాట తప్పితే అంతే..

రంగారెడ్డి జిల్లాకు చెందిన శివారు ఎమ్మెల్యే ఇచ్చిన మాట తప్పితే ఈడీ కేసు తప్పదని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే స్థానికంగా కంటే ఇతర రాష్ట్రాల, దేశాల ప్రముఖులతోనే వ్యాపార లావాదేవీలు సాగిస్తారనే ప్రచారం ఉంది. అయితే ఇటీవల ఈడీ కేసు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కుమార్​తో అనేక లావాదేవీలు సాగించినట్లు, మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, అతని దగ్గరి సంబంధమున్న ఓ కేంద్రమంత్రితో మధ్య వర్తిత్వం నడిపినట్లు, అందుకోసమే ఈడీ నోటీసులు ఎదుర్కోవడంలో జాప్యం జరుగుతుందని సమాచారం. తోకజాడిస్తే ఆ ఎమ్మెల్యేలకు ఈడీ కేసులు తప్పవనే సంకేతాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన లావాదేవీలపై కూడా త్వరలోనే ఈడీ దాడులు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే ఆ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ అధిష్టానం కూడా వేటు వేసే అవకాశాలున్నాయి. వారి రాజకీయ జీవితంపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

న్యూజిలాండ్ లో సెటిల్మెంట్..

క్యాసినో నిర్వాహకుడు ప్రవీణ్ తో న్యూజిలాండ్‌లో సెటిల్మెంట్లు ఎమ్మెల్యే చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడడం ఆరోపణలతోనే ఈడీ నోటీసులు పంపినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే కుమారుడు కూడా ప్రవీణ్ కుమార్‌తో సత్సంబంధాలు, పలు బిజినెస్‌లలో కూడా వాటా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఆ బిజినెస్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

ఓ కేంద్ర మంత్రి అండగా..

మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఓ కేంద్ర మంత్రి బాసటగా ఉన్నట్లు ప్రచారం. ఓ ఎమ్మెల్యే సమీప బంధువు కావడంతోనే వారిపై ఈడీ దాడులు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఒకవేళ ప్రస్తుతం రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని ఆ మంత్రి సైడైతే ఈడీ దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే గతంలో పేకాడుతూ పట్టుబడగా.. అతన్ని కేసు నుంచి తప్పించారని ఆరోపణలున్నాయి.

Also Read : మరోకోణం:రెండు దెబ్బలకు ఒక్క పిట్ట! మునుగోడులో ఏం జరగనుంది?

Advertisement

Next Story

Most Viewed