- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు టీఆర్ఎస్ ఫీవర్! అదే టార్గెట్‌గా కొత్త పార్టీ
తెలంగాణ పదాన్నే సెంటిమెంట్‌గా మార్చుకుని రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీకి ఆ పదాన్ని తొలగించడమే ఇప్పుడు చిక్కుగా మారిందా? ప్రజల్లో భావోద్వేగాలకు కారణమైన ఆ పదమే ప్రస్తుతం బీఆర్ఎస్ వ్యతిరేక ఆలోచన ఉన్నవారిని ఒకే వేదిక మీదకు రానున్నదా? టీఆర్ఎస్ అనే పదాన్ని మర్చిపోలేని తెలంగాణ ప్రజలు, ఓటర్లకు ఇప్పుడు ఆ పేరుతో తెరమీదకు వస్తున్న పార్టీ ప్రత్యామ్నాయం కానున్నదా? ఉద్యమకారులందరూ మళ్లీ ఒకే గొడుకు కిందకు చేరడానికి గ్రౌండ్ సిద్ధమవుతున్నదా? ఇవే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ నాయకుల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతో మారో పార్టీ ఆవిర్భవించబోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ రాజ్య సమితి అనే పార్టీ రిజిస్టర్ అయింది. ఈ మధ్యనే తెలంగాణ రైతు సమితి అనే పేరుతో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు దాఖలైంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న నానుడి తరహాలో రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని సాధించడానికి బీఆర్ఎస్ పార్టీకి తోడ్పడిన ‘తెలంగాణ’ పదం సెంటిమెంట్‌ను వాడుకునే ప్రక్రియ మొదలైంది. ఆ పదాన్ని పార్టీ పేరు నుంచి తొలగించడంతోనే తెలంగాణతో బీఆర్ఎస్‌కు బంధం తెగిపోయిందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ప్రజల్లో వినిపిస్తున్న అభిప్రాయాలను పొంగులేటి, జూపల్లి సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. కొత్తగా వచ్చే ‘టీఆర్ఎస్’ వెనుక పొంగులేటి కీ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం.
టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి...
తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) గతంలోనే రిజిస్టర్ అయినా కొంతకాలంగా ఉనికిలో లేకుండా పోయింది. కొత్తగా తెలంగాణ రైతు సమితి (టీఆర్ఎస్) పేరుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే ఇది కూడా ఉనికిలోకి వస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుని బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పేరుతోనే గట్టి పోటీ ఇవ్వాలని పొంగులేటి భావిస్తున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో గణనీయమైన పట్టు ఉన్న పొంగులేటి.. తనతో వచ్చిన వారిని కలుపుకుని ఇతర జిల్లాల్లోనూ బీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ దూరం పెట్టిందనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని వారిని డ్రైవ్ చేసేలా ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియను ఆయన మొదలుపెట్టినట్టు సమాచారం.
సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు
బీఆర్ఎస్ పార్టీ పేరును కేసీఆర్ ఖరారు చేసినా.. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. తెలంగాణ పదాన్ని తీసేసిన తర్వాత ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్టీలోంచి తెలంగాణ పదాన్ని తీసేయడంపై బీఆర్ఎస్ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించే సాహసం చేయలేకపోతున్నారు. దీనికి తోడు చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్‌లో రెండు గ్రూపుల విధానం కొనసాగుతుండడంతో టికెట్ దక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి.
పొంగులేటి చొరవ తర్వాతే క్లారిటీ
గులాబీ పార్టీ పేరు మార్పుపై వెలువడుతున్న అసంతృప్తిని సద్వినియోగం చేసుకోవాలని పొంగులేటి భావిస్తున్నట్టు టాక్. కొత్త పార్టీని పెట్టి బీఆర్ఎస్‌లోని నేతలను తనవైపుకు తిప్పుకునేంత శక్తి పొంగులేటికి ఉన్నదా? అనే చర్చ ఎలా ఉన్నా టీఆర్ఎస్ అనే మూడక్షరాల పదంతో పాటు పార్టీ పేరులోని ‘తెలంగాణ’ సెంటిమెంట్‌ను వాడుకోవాలనే కాన్సెప్‌లో ఆయన ఉన్నట్టు సమాచారం. వివిధ పార్టీలో కొనసాగుతున్న పలువురి లీడర్లతో పొంగులేటి ఇప్పటికే సంకేతాలు పంపి (తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి) టీఆర్ఎస్ వైపు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.
వ్యక్తిగతంగా వివాద రహితుడు కావడం, ఆర్థికంగా స్థితిమంతుడనే గుర్తింపు ఉండడంతో బీఆర్ఎస్‌పై వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నవారిపైనే పొంగులేటి ఆశలు పెట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా టికెట్ రానివారు ఆయన వెంటనే వస్తారనే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. పార్టీలకు అతీతంగా వివిధ జిల్లాల్లోని నేతలను ఆకర్షించేలా ఇకపైన పావులు ఆయన కదపనున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు పార్టీతో సంబంధం లేకుండా ‘శీనన్న వెంటే’ పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు జిల్లాకు పరిమితం అయిన పొంగులేటి ఇకపైన రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యతిరేకులను, ఆ పార్టీలోని అసంతృప్తివాదులను తనవైపునకు తిప్పుకోవడంపై వ్యూహాన్ని రూపొందించనున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. టీఆర్ఎస్ అనే పదం, తెలంగాణ సెంటిమెంటే రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌పై ఎఫెక్టు పడేలా చేయాలన్నది పొంగులేటి ఆలోచనగా కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ నేతల్లో గుబులు
తెలంగాణ పదం, సెంటిమెంట్ అనేవి కేసీఆర్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చాయో అవే ఇప్పుడు ఆయనకు సంకటంగా మారనున్నాయనే టాక్ బీఆర్ఎస్ నేతల్లోనే వినిపిస్తున్నది. తొమ్మిదేళ్ల పాలనలో వివిధ సెక్షన్ల ప్రజల ఆకాంక్షలు కార్యరూపం దాల్చలేదన్న అసంతృప్తి కూడా వ్యక్తమవుతున్నట్టు ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ద్వారా తెలుస్తున్నది.
ఒకవైపు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ గతంతో పోలిస్తే రాష్ట్రంలో బలపడ్డాయని, ముక్కోణపు పోటీలో ఈసారి చాలాచోట్ల చిక్కులు తప్పవనే అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ పదంతో టీఆర్ఎస్ అనే కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్తే కలిసొచ్చే ప్రయోజనాలపై పొంగులేటి సన్నిహితుల్లో పాటు వివిధ పార్టీల్లో చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్‌లో సైతం టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టుకొస్తే దాని ప్రభావం ఏ మేరకు ప్రజల్లో ఉంటుందనే చర్చ గులాబీ పార్టీలోనే మొదలైంది. రానున్న ఎన్నికల్లో ఎవరికి ఎసరు పడుతుందో అనే గుబులు సిట్టింగ్‌లలో వ్యక్తమవుతున్నది. కేసీఆర్ నిర్ణయంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి ఎన్నికల సమయానికి ఏ స్థాయికి చేరుకుంటుంది? దాని ఎఫెక్ట్ పోలింగ్‌పై ఏ మేరకు పడుతుందనే లెక్కలే ఇప్పుడు గులాబీ నేతల ఆందోళనకు కారణమవుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక లాభమా.. నష్టమా..
అర్బన్ ఓటర్లతో పాటు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయుల్లో కేసీఆర్ పాలనపై అసంతృప్తి, వ్యతిరేకత వేర్వేరు స్థాయిల్లో నెలకొన్నది. ఓట్ల సమయానికి ఇది ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? అనే అంచనాలు ఆయా పార్టీల్లో ఒక్కో రకంగా ఉన్నాయి. ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజల అభిప్రాయం అసంతృప్తి స్థాయిలో ఉన్నదా? లేక వ్యతిరేకత స్థాయికి చేరుకున్నదా? అనే విశ్లేషణ బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది.
టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఉనికిలోకి వస్తే తమకు ఏ మేరకు అనుకూలంగా మారుతుంది? బీజేపీ, కాంగ్రెస్ పార్టీలవైపు ఏ మేరకు మళ్లుతుంది? అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఇక పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదా? లేక పార్టీకి చేటు తెస్తుందా? అనేది రానున్న అసెంబ్లీ ఎన్నికల్ల ప్రజలు ఇచ్చే తీర్పు కొలమానంగా ఉంటుందనేది అన్ని పార్టీల నేతల కామన్ అభిప్రాయం. బీఆర్ఎస్‌కు టీఆర్ఎస్ అనే పదమే ముప్పుగా మారుతుందా..? ఆ పార్టీ తలరాతను ఈ నిర్ణయమే తేల్చనున్నదా? అనేది కూడా ఒక చర్చనీయాంశం.