టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బదిలీ

by Sathputhe Rajesh |
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బదిలీ
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఇన్చార్జి ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇటుకల భాస్కర్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వైరా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఇప్పటివరకు ఎవరికి పోస్టింగ్ ఇవ్వలేదు. మణుగూరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఇటుకల భాస్కర్‌ను ఖమ్మం సుడా, వైరా మున్సిపాలిటీకి టీపీఓగా గతంలో అదనపు బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సుడాతో పాటు మణుగూరు, వైరా మున్సిపాలిటీలో వారానికి రెండు రోజులు ఆయన విధులు నిర్వహిస్తున్నారు.

అయితే వైరా మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా అనేక అక్రమ భవనాలు నిర్మించారు. అంతేకాకుండా డీటీసీపీ అనుమతులు లేకుండా పలు రాజకీయ పార్టీల నాయకుల అండతో అక్రమ వెంచర్లు వేశారు. అక్రమ భవనాలు, అనుమతిలేని వెంచర్లపై దిశ దినపత్రికలో ఇప్పటి వరకు అనేక వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే నేటి వరకు అక్రమ భవనాలు, డీటీసీపీ అనుమతి లేని వెంచర్లపై కనీస చర్యలు తీసుకోలేదు. వీటిపై చర్యలు తీసుకునేందుకు టీపీఓ భాస్కర్‌పై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు నెలకొన్నాయి.

దీంతో వైరాలో తాను పనిచేయలేనని ఓ నిర్ధారణకు వచ్చిన టీపీఓ వైరా మున్సిపాలిటీ విధుల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. దీంతో శుక్రవారం ఉన్నతాధికారులు ఆయనను వైరా నుంచి బదిలీ చేశారు. అయితే ఆయన స్థానంలో ఎవరికి వైరా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటి నుంచి టీపీఓ భాస్కర్ ఖమ్మం సుడాలో నాలుగు రోజులు, తన ఒరిజినల్ పోస్టింగ్ అయిన మణుగూరులో రెండు రోజులు విధులు నిర్వహించనున్నారు.

వైరాలో అక్రమ భవన నిర్మాణాలు, డీటీసీపీ అనుమతి లేని వెంచర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటున్నాయి. వారం రోజుల్లో కొంతమంది అధికారులు వైరా మున్సిపాలిటీ నుంచి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని విస్తృత ప్రచారం జరుగుతుంది. నూతనంగా వచ్చే టీపీఓ అయినా అక్రమ భవనాలు, డిటిసిపి అనుమతి లేని వెంచర్లపై చర్యలు తీసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయా.. లేదా.. నూతనంగా వచ్చే అధికారిపై కూడా రాజకీయ ఒత్తిళ్ళు "మామూలు" గా కొనసాగుతాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed