ఫార్ములా - ఈ రేస్ ఎఫెక్ట్.. టాఫ్రిక్‌ ఆంక్షలతో నరకయాతన పడుతోన్న నగరవాసులు!

by Satheesh |   ( Updated:2023-02-07 12:50:56.0  )
ఫార్ములా - ఈ రేస్ ఎఫెక్ట్.. టాఫ్రిక్‌ ఆంక్షలతో నరకయాతన పడుతోన్న నగరవాసులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్లో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ- రేసింగ్ పోటీలు జరగనున్నాయి. హుస్సేన్‌సాగర్‌ వేదికగా జరుగనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల రేస్ కోసం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ ఆదివారం నుంచి మొదలైన ఆంక్షలు ఈనెల 12వ తేదీ వరకు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ట్రాఫిక్ మళ్లింపుల వల్ల నరకయాతన పడుతున్నామని మండిపడుతున్నారు. మంగళవారం ఎన్టీఆర్ మార్గ్‌లో వాహనదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

'మీ కారు కోసం మాకెందుకు ఈ కష్టాలు' అని వాహనదారులు పోలీసులను, అధికారులను నిలదీశారు. ఆంక్షలు అమలులో ఉన్నాయి వెళ్లద్దంటున్నా కూడా వినకుండా వాహనదారులు అధికారులపై సీరియస్ అయ్యారు. తమకు వాటితో సంబంధం లేదని, తమను వెళ్లనివ్వాలని, మీ కోసం మేం ఎందుకు ఇబ్బంది పడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్ రేస్ కోసం ఏర్పాటు చేసి రోడ్డు, నలుమూలలా మూసివేస్తే ఏవైపు నుండి వెళ్ళాలో తెలియక ఇబ్బంది అవుతుందని, వారాల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తే.. నగరం చుట్టూరా తిరగాల్సి వస్తుందని మండిపడ్డారు. నగరంలో ఓవైపు ట్రాఫిక్ జాం వంటి సమస్యలు ఉండగా.. పోలీసులు ఈ విధంగా ఆంక్షలు విధించడం సరికాదంటున్నారు.

ఇలా వారాల పాటు విధిస్తున్న ఆంక్షల మూలంగా సామాన్య ప్రజలైన తమకి పెట్రోల్, డిజీల్‌‌కే జేబులు ఖాళీ అవుతున్నాయని వాపోతున్నారు. కాగా, ట్రాఫిక్ ఆంక్షల ప్రభావంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్, రవీంద్రభారతి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్ రూట్‌లో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. రద్దీతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రత్యామ్నాయ రూట్‌లు చూసుకోవాలని ఇది వరకే అధికారులు సూచించారు. కానీ, ప్రత్నామ్నాయ మార్గాల్లోనే రద్దీ పెరిగిందని, దీనికి అధికారులు పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed