సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎఫెక్ట్: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

by GSrikanth |   ( Updated:2023-04-30 00:00:43.0  )
సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎఫెక్ట్: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం ఓపెనింగ్ కార్యక్రమంతో టాంక్‌బండ్ చుట్టూ ఉన్న రోడ్లను ట్రాఫిక్ పోలీసులు మూసేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నెక్లెస్ రోడ్డు, ప్రసాద్ ఐమాక్స్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ తదితరాలన్నింటిపై వాహనాల రాకపోకలను, సందర్శకుల కదలికలను ట్రాఫిక్ పోలీసులు నిలిపేస్తున్నారు. అన్ని రోడ్లపైనా బారికేడ్లు పెట్టి ఇతర రోడ్లగుండా ట్రాఫిక్‌ను దారిమళ్ళించారు. దీంతో ఉదయం మొదలు రాత్రి వరకు బుద్ధ విగ్రహం బోటింగ్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ పార్కు సందర్శన క్లోజ్ అయ్యాయి. గతంలో కొన్ని వారాల పాటు సండే ఫండే లాంటి ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం నిర్వహించినా ఈ సండే మాత్రం అక్కడకు వెళ్ళే ఫ్యామిలీలకూ పోలీసుల ఆంక్షలు ఎదురవుతాయి.

సెక్రెటేరియట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి, మంత్రుల మొదలు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, జిల్లా సహకార బ్యాంకుల చైర్‌పర్సన్లు, వివిధ శాఖల హెచ్‌ఓడీలు, కార్యదర్శులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు.. ఇలా సుమారు రెండున్నర వేల మంది వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. వీరితో పాటు వచ్చే అనుచరగణం, సిబ్బంది, కాన్వాయ్ వాహనాలతో టాంక్‌బండ్ పరిసరాలన్ని క్రిక్కిరిసిపోనున్నాయి. సుమారు 2,200 వాహనాలకు పార్కింగ్ సౌకర్యంపై పోలీసులు దృష్టి పెట్టడంతో ఇంతకు మించిన సంఖ్యలో వచ్చే సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల టూ వీలర్లతో సామాన్య జనానికి చిక్కులు ఎదురుకానున్నాయి.

సచివాలయ ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీ స్థాయిలో పోలీసు భద్రత ఏర్పాటవుతున్నది. ఉదయం ఆరు గంటల నుంచి సుదర్శన యాగం, మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో పూర్ణాహుతి, ఆ తర్వాత ముఖ్యమంత్రి చేతుల మీదుగా సచివాలయం ఓపెనింగ్, అనంతరం మంత్రుల చాంబర్ల ప్రారంభోత్సవాలు.. ఇలా వరుస కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడే మోహరించనున్నది. వీరందరి భద్రత కోసం వేల సంఖ్యలో పోలీసులు పహరా కొనసాగనున్నది. సామాన్యుల కదలికలపై సమీప రోడ్లపై పూర్తిగా నిషేధం విధించడంతో ఆ చుట్టుపక్కల హడావిడి వాతావరణం చోటుచేసుకోనున్నది.

రెండున్నర వేల వాహనాలకు పార్కింగ్

ఏయే రోడ్లను క్లోజ్ చేస్తున్నదీ పోలీసులు ముందుగానే తెలియజేసి ప్రత్యామ్నాయ రోడ్లకు మళ్ళాల్సిందిగా సూచించారు. సచివాలయం ఓపెనింగ్ కోసం సుమారు 2,200 ఇన్విటేషన్ కార్డులు, పాస్‌లు జారీచేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి వాహనాలను ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందో ముందుగానే సూచించి దానికి తగిన ఏర్పాట్లను చేశారు. సీఎం కాన్వయ్ మొదలు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రుల వాహనాలన్నీ (23) సచివాలయం ప్రాంగణంలోని వెస్ట్ సైడ్ పార్కింగ్ ప్రాంతానికి వెళ్తాయి. ప్రభుత్వ సలహాదారులు, క్యాబినెట్ ర్యాంకు చైర్‌పర్సన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, విప్‌లు, వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులకు చెందిన సుమారు 280 వాహనాలను సచివాలయం ప్రాంగణంలోని సౌత్ ఈస్ట్ వైపు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు జరిగాయి.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు వివిధ హోదాల్లోని అధికారులు, రాజ్‌భవన్ ఆఫీసర్లకు చెందిన 240 కార్లను సచివాలయం పక్కనే ఉన్న (ఎన్టీఆర్ పార్కుకు ఆనుకుని) పార్ములా-ఈ రేస్ రోడ్డు మీద పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. సచివాలాయంలో పనిచేసే వివిధ స్థాయిల్లోని సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున వారికి చెందిన సుమారు 1400 కార్లను నార్త్ ఈస్ట్ గేటు (ఎన్టీఆర్ పార్కు వైపు) దిశగా సచివాలయం ప్రాంగణం లోపలే పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మరో 200 వరకు జిల్లాల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర స్థాయిల అధికారుల వాహనాలను ప్రసాద్ ఐ-మాక్స్ థియేటర్ పక్కన (అంబేద్కర్ స్మారకమందిరం సమీపంలో) పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

దాదాపు మూడు వేల మంది సచివాలయం ప్రారంభోత్సవానికి వస్తున్నందున పరిసర రోడ్లన్నింటిపై పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే సచివాలయ సమీపంలోని రోడ్లపైకి ఎంట్రీ ఉంటుంది. మిగిలిన వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. దీంతో లోకల్ ప్రజలు ఇతర రోడ్లను ఆశ్రయించక తప్పడంలేదు. వీటన్నింటి కారణంగా ఇతర రోడ్లపై భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశమున్నది. కంట్రోల్ చేయడానికి తగినంత మంది పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండే అవకాశమూ లేదు.

Advertisement

Next Story