నేడే పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్.. ఇవి తప్పక పాటించండి!

by GSrikanth |   ( Updated:2023-04-29 23:30:16.0  )
నేడే పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్.. ఇవి తప్పక పాటించండి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా వివిధ విభాగాల కానిస్టేబుల్‌ పోస్టులకు తుదిరాత పరీక్షను నేడు (ఆదివారం) నిర్వహించనున్నారు. పది జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్‌ కానిస్టేబుల్, వివిధ పోస్టులకు తుది రాతపరీక్షలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2: 30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ (ఐటీ అండ్ సీవో) అభ్యర్థులకు తుది రాతపరీక్ష ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్ష నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

అభ్యర్థులు తమ హాల్ టికెట్‌పై పాస్ పోర్ట్ సైజు ఫోటో అంటించుకొని రావాలి. లేనిచో పరీక్షకు అనుమతించరని టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు తెలిపింది. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు. పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు. కాబట్టి మెహిందీ, టాటూలూ పెట్టుకోవద్దని అభ్యర్థులకు బోర్డు సూచించింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన హాల్ టికెట్, బ్లాక్, బ్లూ పెన్, మాత్రమే అభ్యర్థులు సెంటర్‌కు తీసుకురావాలని సూచించింది. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులు హాల్ లోనే ఉండాలని, ఒకసారి పరీక్షా హాలులోకి అనుమతించిన తర్వాత పరీక్షా పూర్తయిన అనంతరం మాత్రమే బయటకు అనుమతిస్తారని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed