- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు హస్తినకు CM రేవంత్.. మూడు రోజుల పాటు అక్కడే కారణమిదే..!
దిశ, తెలంగాణ బ్యూరో : పరిపాలనపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ఢిల్లీ వెళ్తున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలకు పరిష్కారం కనుగొనడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిల విడుదలపై ఒత్తిడి చేయనున్నారు. మూడు రోజుల ఢిల్లీ టూర్‌లో పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు రాష్ట్రానికి రానున్న బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెంచాల్సిందిగా కోరనున్నారు. ఈ నెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్ర గ్రాంట్లను పెంచాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి చర్చించనున్నారు.
జల వివాదాలపై కేంద్ర మంత్రితో సమావేశం
గోదావరి, కృష్ణా బేసిన్‌లకు సంబంధించిన పలు ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న జల వివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వయిజర్ ఆదిత్యనాధ్ దాస్, సెక్రటరీ రాహుల్‌బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ చర్చించనున్నారు. గోదావరి-కావేరీ నదుల అనుసంధానంలో తెలంగాణ తరఫు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పు స్ఫూర్తి మేరకు రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలన్న అంశాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజీ విషయంలో మధ్యంతర నివేదిక ఇచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదికను త్వరగా ఇచ్చేలా ఎన్డీఎస్ఏ చైర్మన్‌ను మంత్రి ఉత్తమ్ కలిసి చర్చించనున్నారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఢిల్లీ వెళ్లి సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
ఏపీ-తెలంగాణ సీఎంల మీటింగ్‌పై వివరణ
విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉండిపోయిన పలు అంశాలపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సీఎంతో జరిగిన సమావేశంలో జరిగిన చర్చల వివరాలను కేంద్ర హోం మంత్రికి వివరించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలపై తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరే అవకాశమున్నది. డిఫెన్స్ లాండ్స్ కేటాయింపు మొదలు సైనిక్ స్కూలు ఏర్పాటు వరకు అనేక అంశాలను ఈ పర్యటన సందర్భంగా కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు.
31 అంశాలు... 11 పేజీలతో షార్ట్ నోట్స్
ఎంపీలుగా ఇటీవల ఎన్నికైన ఎనిమిది మంది పార్లమెంటు వేదికగా ప్రస్తావించి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చేలా ప్రత్యేక నోట్‌ను, కేంద్ర మంత్రిత్వశాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వం జాబితాను తయారుచేసి అందించింది. గిరిజన వర్శిటీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు నేషనల్ హైవే గుర్తింపు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, ఎక్స్ ప్రెస్ హై వేల నిర్మాణం, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సెమీ కండక్టర్ పరిశ్రమల స్థాపన, 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు, వెనకబడిన రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన డెవలప్‌మెంట్ ఫండ్స్, కొత్త రైల్వే లైన్‌ల నిర్మాణం, సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు, ధాన్యం సేకరణ పెండింగ్ బిల్లులు, డ్రగ్స్ నియంత్రణకు నిధులతో పాటు టెక్నికల్ సాయం, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచడం (కేడర్ రివ్యూ)... ఇలాంటి అనేక అంశాలను సీఎం ఢిల్లీ టూర్‌లో ఎంపీలతో, కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.
సోనియా, రాహుల్‌తో సమావేశాలు
రాష్ట్రంలో రుణమాఫీ స్కీమ్ అమలవుతున్న విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించనున్నారు. పథకం అమలుకు అవసరమవుతున్న మొత్తం రూ. 31 వేల కోట్లలో ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కోసం విడుదల చేసిన రూ. 6,098 కోట్ల గురించి ఆమెకు వివరించనున్నారు. ఈ నెల చివర్లో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న విజయోత్సవ సభకు రావాల్సిందిగా రాహుల్‌గాంధీని ఆహ్వానించనున్నారు.