‘కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలి’

by GSrikanth |
‘కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ కబంధహస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, పార్టీలకు అతీతంగా ఉద్యమకారులందరూ ‘తెలంగాణ బచావో’ సదస్సుకు రావాలని విద్యార్థి జన సమితి పిలుపునిచ్చింది. మార్చి 10వ తేదీన హైదరాబాద్‌లో తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘తెలంగాణ బచావో’ సదస్సు పోస్టర్‌ను వీజేఎస్ నాయకులు శనివారం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన 1200 అమరవీరుల కుటుంబాలకు ఆదుకోకుండా 500 మందిని గుర్తించి, మిగతా వారికి నిర్లక్ష్యం చేశారని, మిగిలిన కుటుంబాలను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని విద్యార్థుల విరోచిత పోరాటం, ఆత్మ బలిదానాలు, ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ సకల జనుల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందన్నారు. నాటి ఉద్యమ ఆకాంక్షలు మరచిన కేసీఆర్ సర్కార్‌పై పోరాటానికి తెలంగాణ ఉద్యమకారులు పార్టీ జెండాలు పక్కన పెట్టి ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నకిరేకంటి నరేందర్, రాష్ట్ర నాయకులు మన్నల నేత్ర, నాయకులు అమిత్, వ్యాస్, మనోజ్, అంజి, హరీష్, ప్రదీప్, ఉదయ్, మోహన్, సాయిరాం, కృష్ణ, నరేష్, సంజయ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed