ఖానాపూర్ కాంగ్రెస్‌లో టికెట్ వార్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-22 02:40:10.0  )
ఖానాపూర్ కాంగ్రెస్‌లో టికెట్ వార్!
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నిన్నటిదాకా అభ్యర్థులు కరువు అనుకున్న పరిస్థితుల్లో తాజాగా అభ్యర్థుల తాకిడి పెరిగింది. హైదరాబాద్ తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒకరిద్దరు నడుమనే అంతంతమాత్రంగా పోటీ ఉండగా తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య పెరగడంతో పాటు టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.

గోండు వర్సెస్ లంబాడా

ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రధానంగా నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరో ఇద్దరు టికెట్ ఆశిస్తున్నప్పటికీ గట్టిగా పట్టు పట్టడం లేదు. ఖానాపూర్ నియోజకవర్గ చిత్రంగా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తగా ఏర్పాటు అయిన నాలుగు జిల్లాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో అన్ని జిల్లాల దృష్టి నెలకొంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గతంలో కాంగ్రెస్ తరపున కోట్నాక భీమ్రావు రెండుసార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. పార్టీ సీనియర్ నేత రవీందర్రావు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు.

మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ బలపడింది. ఆ తర్వాత ఆయన కూడా బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి నడిపే నేత లేకుండా పోవడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌పై నమ్మకం సన్నగిల్లింది. అయితే తాజాగా కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా బలపడుతున్న సంకేతాల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలోనూ అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నది. అయితే నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్ కావడంతో గోండు, లంబాడా సామాజిక వర్గాల నడుమ పోటీ నెలకొంది. గోండు సామాజిక వర్గానికి చెందిన వెడ్మ బొజ్జు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆశీస్సులతో టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఆదిమ గిరిజన తెగలకు చెందిన అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్నారు. ఇక లంబాడా సామాజిక వర్గం నుంచి జడ్పీటీసీ చారులత రాథోడ్, యువజన కాంగ్రెస్ నేత భరత్ చౌహన్ పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్ వస్తుందని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు అధికార పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆమె తీవ్ర నిరాశలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. తాజాగా ఆమె కూడా కాంగ్రెస్ టికెట్‌తో బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో లంబాడా సామాజిక వర్గంలో త్రిముఖ పోటీ నెలకొనడంతో పాటు టికెట్ కోసం సొంత పార్టీలోనే చతుర్ముఖ పోటీ నెలకొంది. టికెట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed