కాంగ్రెస్‌లో టికెట్ టెన్షన్.. ఆశావహుల్లో తీవ్ర ఆందోళన

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-22 03:46:17.0  )
కాంగ్రెస్‌లో టికెట్ టెన్షన్.. ఆశావహుల్లో తీవ్ర ఆందోళన
X

దిశ, కరీంనగర్ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులకు టికెట్​ టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్​పార్టీ తరుపున పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించగా ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు దండిగా వచ్చాయి. దీంతో స్క్రీనింగ్​ కమిటీ దరఖాస్తులను షార్ట్​లిస్ట్​చేసిన ఢిల్లీకి జాబితా పంపించింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. అయితే జాబితాను ఈ నెలాఖారులో విడుదల చేయడానికి సన్నద్దం అవుతుంది. జాబితా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్​అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.

దండిగా దరఖాస్తులు..

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​టికెట్​కోసం ఈసారి దండిగా దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, రామగుండం శాసనసభ నియోజకవర్గాలు ఉండగా అన్ని నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు దండిగా వచ్చాయి. జగిత్యాల టికెట్​ కోసం ఒక్క దరఖాస్తు రాగా మంథని నుంచి రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మిగిలిన నియోజకవర్గాల్లో మూడు నుంచి 13వరకు దరఖాస్తులు వచ్చాయి. టికెట్​కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను పరిశీలించిన కాంగ్రెస్​పార్టీ ఎన్నికల స్క్రీనింగ్​ కమిటీ అభ్యర్థుల షార్ట్ లిస్ట్​తయారు చేసింది. ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురి పేర్లను మాత్రమే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది.

ఈ నియోజకవర్గల్లో గట్టి పోటీ..

కాంగ్రెస్​పార్టీ టికెట్ల కోసం కొన్ని చోట్ల గట్టి పోటీ ఉంది. కరీంనగర్ టికెట్​కోసం పెద్దఎత్తున దరఖాస్తులు రాగా ఐదుగురి పేర్లు ఫైనల్​ చేసి పంపినట్లు సమాచారం. కొత్త జైపాల్​రెడ్డి, కల్వకుంట్ల రమ్యరావు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రోహిత్​ రావు, కొనగాల మహేష్‌లతో ఒక్కరిని ఫైనల్​ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. చొప్పదండి నియోజకవర్గంలో మేడిపల్లి సత్యం, జిల్లెల భానుప్రియ ఇద్దరు పేర్లు పరిశీలనకు వెళ్లినట్లు సమాచారం. హుస్నాబాద్​టికెట్​కోసం అలిగిరెడ్డి ప్రవీణ్​రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్​ పేర్లు పరిశీలనకు వెళ్లినట్లు తెలిసింది. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం నాలుగురు దరఖాస్తు చేసుకోగా కేకే మహేందర్, సంగీతం శ్రీనివాస్​పేర్లు పరిశీలనకు వెళ్లినట్లు సమాచారం.

కోరుట్ల నియోజకవర్గం టికెట్​కోసం జువ్వాడి నర్సింగరావు, కోమిరెడ్డి కరమ్​చంద్, కల్వకుంట్ల సుజిత్​రావు పేర్లు పరిశీలనకు వెళ్లినట్లు సమాచారం. ధర్మపురి నియోజకవర్గ టికెట్ కోసం వడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు గజ్జెల స్వామి ఇద్దరి పేర్లు పరిశీలనకు వెళ్లినట్లు సమాచారం. పెద్దపల్లి నియోజకవర్గం టికెట్​ కోసం మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, గంట రాములు, ఈర్ల కొమురయ్య పేర్లు పరిశీలనకు వెళ్లినట్లు సమాచారం. రామగుండం టికెట్​ కోసం నలుగురు దరఖాస్తు చేసుకోగా ఇందులో మక్కాన్​సింగ్, జనక్​ప్రసాద్, హర్కరా వేణుగోపాల్​రావు పేర్లు పరిశీలనకు వెళ్లినట్లు తెలిసింది. మిగిలిన చోట్ల ఒక్కరి చొప్పున పేర్లు ఖారారు చేసినట్లు తెలిసింది.

అభ్యర్థుల్లో టెన్షన్..

కాంగ్రెస్​పార్టీ అభ్యర్థుల షార్ట్​లిస్ట్​ఢిల్లీకి చేరడంతో కాంగ్రెస్​పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఢిల్లీకి చేరిన జాబితాను వడపోసి ఈ నెల చివరలో జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించింది. జాబితా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో టికెట్​వస్తుందో రాదోననే ఆందోళన మొదలైంది. అయితే టికెట్​వస్తుందని ఆశించి భంగపడ్డ నేతలు ఎన్నికల సమయంలో సహకరిస్తారా? లేదా? అనే అందోళన సైతం నెలకొన్నది.


Read More..

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. 60 మందితో తొలి జాబితా..!

Advertisement

Next Story