నేను ఓడిపోవడానికి నీ కొడుకు కారణం కాదా? కేసీఆర్ విమర్శలకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్

by Javid Pasha |
నేను ఓడిపోవడానికి నీ కొడుకు కారణం కాదా? కేసీఆర్ విమర్శలకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ బ్యూరో, ఖమ్మం: పాలేరులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తనపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఓడిపోయి ఇంటి దగ్గర వున్నోడిని తీసుకువచ్చి మంత్రి పదవి ఇస్తే ఖమ్మం జిల్లాలో నేను పార్టీ కోసం చేసింది సున్నా అని, పాలేరులో వెంకటరెడ్డి చనిపోతే వచ్చిన ఉపఎన్నికల్లో నేను బతిమాలితే టికెట్ ఇచ్చి మేమంతా దగ్గర వుండి 40వేల ఓట్ల మెజారిటీతో గెలిపించామని సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. నిజానికి ఆరోజు పాలేరులో పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే పార్టీ శ్రేయస్సు కోరి నేను పోటీ చేశానన్న సంగతి మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఖమ్మం జిల్లాలో కేవలం నీ పార్టీకి కొత్తగూడెం సీటు మాత్రమే వస్తే.. ఆ తరుణంలోనే కదా మీరు స్వయంగా నా దగ్గరకు వచ్చి మూడు గంటలసేపు బతిమాలి మరీ నన్ను పార్టీలోకి ఆహ్వానించింది అని గుర్తుచేశారు. నేనేమైనా పైరవీల కోసం, పదవుల కోసం మీ పార్టీలో చేరానా ? ఆరోజు పార్టీలో చేరేముందు కూడా పదవుల గురించి నేను మాట్లాడలేదు.. కేవలం భక్తరామదాసు,సీతారామ ప్రాజెక్టుల గురించి పార్టీలో జాయిన్ అవుతున్నానని నేను మీకు చెప్పింది నిజం కాదా? దానికి మీరు ఒప్పుకున్నది నిజం కాదా? అన్నారు. కానీ ఈరోజు నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను పార్టీలోకి రాకముందు మీ పార్టీకి జెండా పట్టే కార్యకర్త లేడని, కేవలం నేను పార్టీలో జాయిన్ అయిన తరువాత 280 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్,జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీతో సహా వేల మంది కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి మీ సమక్షంలోనే పార్టీలో చేరిన సంగతి మర్చిపోయి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

అసలు 2018 ఎన్నికల్లో పాలేరులో నా ఓటమికి కారణం ఎవరో మీ అంతరాత్మకు తెలుసని, నీ కొడుకు స్నేహితుడు పువ్వాడ అజయ్ ను మంత్రిని చేయడం కోసం, ధనదాహంతో ఆయనతో కలిసి వ్యాపారాలు, హైదరాబాద్ బాచుపల్లిలో మమత మెడికల్ కాలేజీ పెట్టుకోవడం కోసం స్వయంగా నీ కొడుకే నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి ఓడించింది నిజం కాదా? అన్నారు. ఈ విషయం తెలిసీ కూడా ఏమి చేయలేని అచేతన స్థితిలో నువ్వు వెళ్ళింది నిజం కాదా? అంతే కాకుండా ఎన్నికలకు నెలరోజుల ముందు టికెట్లు కేటాయించి నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించింది నీ కొడుకు కాదా ? పార్టీలో జరుగుతున్న అణ్యధోరణులను ఎప్పటికప్పుడు మీకు చెప్పినప్పటికీ మీరు పెడచెవిన పెట్టీ పార్టీ బ్రష్టుపట్టిపోవడానికి కారణం మీరు కాదా ? ఇంత జరిగినా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఎవరిని సంప్రదించకుండా ఆప్పటికపుడు నామా నాగేశ్వరరావుకు ఎంపీ టికెట్ కేటాయిస్తే పార్టీకి కట్టుబడి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. ఆ తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో,రెండు ఎమ్మెల్సి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నేను చేసిన కృషి ఏమిటో మీకు తెలియదా? అని ప్రశ్నించారు.

'ఇన్ని అవకాశవాద మాటలు మాట్లాడిన మీరు స్వయంగా భక్తరామదాసు ప్రాజెక్ట్ ప్రారంభానికి వచ్చినపుడు సభలో అపర భగీరథున్ని నేను కాదు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు అంటూ నా గురించి మీరు ఆన్న మాటలు ఇంకా పాలేరు ప్రజలు మర్చిపోలేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వుంది అని మీరు నాకు ఇచ్చిన కితాబు ఇంకా పాలేరు ప్రజల గుండెల్లో నిక్షిప్తమై వుంది అనే విషయం మర్చిపోయి మీరు నాపై చేసిన వ్యాఖ్యలు బాధాకరం. 40 సంవత్సరాల మన ఇద్దరి స్నేహంలో నేనేంటో, నా నిబద్ధత ఏమిటో తెలిసి కూడా నా పార్టీ మార్పు గురించి ఇలాంటి నీతిమాలిన మాట్లాడటం నీ విజ్ఞతకే వదిలేస్తున్నా.. అసలు పదవుల కోసం, అవసరాల కోసం పార్టీలు మారిన పువ్వాడ అజయ్ కుమార్ కు గవర్నమెంట్ భూములు కట్టబెట్టి,కందాల ఉపేందర్ రెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టి వాళ్ళను పక్కన పెట్టుకుని పార్టీల మార్పు గురించి మాట్లాడటం హాస్యస్పదంగా ఉంది' అని తుమ్మల పేర్కొన్నారు.

Next Story

Most Viewed