Bandi Sanjay: రాసిపెట్టుకోండి.. స్టేట్ పాలిటిక్స్ లో జరగబోయేది ఇదే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-08-30 07:46:42.0  )
Bandi Sanjay:  రాసిపెట్టుకోండి..  స్టేట్ పాలిటిక్స్ లో జరగబోయేది ఇదే..  బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ వచ్చే పరిస్థితి లేదని, రాసిపెట్టుకోండి.. 2028లో రానున్నది రామరాజ్యమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యి మీద పడినట్లు అయిందని, కేసీఆర్ వద్ద శిక్షణ పొందిన కార్యకర్తలే కాంగ్రెస్ నాయకులని పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్ నాగోల్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. ఇది తన మాట కాదని, ప్రజల మాటని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి పొరపాటు చేశామని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచామన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు.

ప్రత్యామ్నాయం బీజేపీయే..

కేసీఆర్‌ను ప్రజలు చీదరించుకుంటున్నారని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీయేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. అన్ని మోర్చాలు సభ్యత్వ నమోదులో తమ టార్గెట్‌ను రీచ్ కావాలని శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సభ్యత్వ నమోదు ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు మాత్రమే వినిపిస్తే బీఆర్ఎస్ కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోశ్‌రావు పేర్లు మాత్రమే వినిపిస్తాయన్నారు. వారి పార్టీ కోసం ఎంతోమంది యువకులు బలిదానం అయితే ఆ పార్టీలు మాత్రం వారి కోసం ఆలోచించవని మండిపడ్డారు. దీనిపై ఆ పార్టీ కేడర్ ఆలోచన చేయాలని సూచించారు. ఎక్కువ సభ్యత్వాలు చేసే మోర్చాలను ప్రోత్సహించేలా వారిని సన్మానిస్తామని బండి వెల్లడించారు.

బీఆర్ఎస్‌ను వదిలే ప్రసక్తే లేదు..

బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ వదిలిపెట్టినా తాను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, గత ప్రభుత్వంలో గుర్రంపోడులో బీజేపీ కార్యకర్తలపై తన కళ్ల ముందే లాఠీ‌చార్జీ చేసి కొట్టి జైలు పాలు చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు. తమ కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టి దారుణంగా హింసించారన్నారు. అలాంటి పార్టీని విడిచే ప్రసక్తే లేదన్నారు. ఆరు గ్యారంటీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్ద డ్రామా కంపెనీ అని విమర్శించారు. రుణమాఫీ ఎంతమందికి అయిందో సర్వే చేస్తామని అంటున్నారని, ఆ లెక్క బ్యాంకులను అడిగితే సరిపోతుంది కదా ఆ మాత్రం దానికి సర్వేలు దేనికని బండి ఫైర్ అయ్యారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు. హైడ్రా పేరుతో పెద్ద హైడ్రామాకే తెరలేపారని ధ్వజమెత్తారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని, బడా బాబులకు న్యాయం చేసి పేదలను అన్యాయం చేస్తామంటే ఊరుకోమని స్పష్టం చేశారు. ఒక్క ఎన్ కన్వెన్షన్‌ను కూల్చి ఇతర బడా కంపెనీలను, ఫామ్‌హౌస్‌లను కాపాడుతామంటే బీజేపీ ఒప్పుకోదన్నారు.

Advertisement

Next Story

Most Viewed