Eatala Rajendar: ఫోర్త్ సిటీలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది ఇదే.. ఈటల సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |
Eatala Rajendar: ఫోర్త్ సిటీలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది ఇదే.. ఈటల సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. గురువారం ఇందిరా పార్క్ వద్ద ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి ఈటల హాజరై వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చౌటుప్పల్, భువనగిరి అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఎన్నికల ముందు చెప్పిన వాటిని ఇప్పుడు అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో కేంద్రానికి సంబంధం ఉందంటే నేనే ముందు ఉండి రైతుల పక్షాన కేంద్రంతో మాట్లాడి సహాయం చేయించే బాధ్యత నాది అన్నారు. 5 కోట్ల రూపాయల ఇళ్లు కూలగొట్టి 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామంటున్నారు. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా? అని ప్రశ్నించారు. రెండు ఎకరాల భూమి తీసుకుని రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు పరిస్థితి ఏంటీ? ఇలా చేస్తే రైతులు బిచ్చగాళ్లు అవుతారని, గజ్వేల్ లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ప్రజలు అడ్డామీది కూలీలుగా మారారన్నారు. భూమి ఉంటే భద్రత, భరోసా అన్న ఈటల.. భూమి లాక్కోని రోడ్డుమీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు ఇది రజాకార్ సర్కార్ కాదన్నారు. రైతులు దగా పడుతుంటే చూస్తే ఊరుకునేది లేదన్నారు. ఫోర్త్ సిటీలో అధికార పార్టీ నేతలు భూములు రైతుల నుంచి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, అధికార పార్టీ నేతలు రైతుల పొట్టకొట్టి వేలకోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఎంత గొప్ప పదవీలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యమన్నారు. సంపూర్ణంగా సమిష్టిగా పార్టీలకు అతీతంగా తెగపడి కొట్లాడాలి ప్రజలు ఓట్లు వేసి 2028 వరకే అధికారం కట్టబెట్టారని విషయాన్ని గుర్తించాలన్నారు.

గజ్వేల్, ఫార్మసిటి నిర్వసితులకూ మా మద్దతు:

ఈ ధర్నాలో గజ్వేల్, ఫార్మసిటి భూనిర్వసితులు కూడా ఉన్నారని వారికి కూడా మా మద్దతు ఉంటుందన్నారు. మీది నిజాం సర్కారో, రాజకార్ రాజ్యమో కాదని ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వారన్న సంగతి మరిచిపోకూడదన్నారు. రాష్ట్రంలో ఎవరిని కదిలించిన ఏదో ఒక దుఃఖంలో ఉన్నారని, ఎవరు కూడా క్షేమంగా ఉన్నామని చెప్పడం లేదన్నారు. ఈ ధర్నాకు రైతులు కుటుంబాలతో సహా వచ్చారు మీకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ఈ ప్రభుత్వంతో బరిగీసి కొట్లడుదాం వారి మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. రోడ్లకు, ప్రాజెక్ట్ లకు భూములు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మార్కెట్ ప్రకారం సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. స్థానిక రైతులు అభిప్రాయం తెలుసుకోకుండా, వారి గోడు వినకుండా భూములు గుంజుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు రాబందుల్లా వ్యవహరించవద్దన్నారు. పేదలను ఏడిపించి ఏం సాధిస్తారని దుయ్యబట్టారు. గజ్వేల్ లో 19 ఊర్లను ఖాళీ చేసి ఆర్అండ్ఆర్ కాలనీకి తెచ్చారు. అక్కడ ఇప్పుడు పది ఎకరాల రైతు కూడా అడ్డామీద కూలీగా మారారని గుర్తు చేశారు. అందువల్ల ట్రిబుల్ ఆర్ ను ఓఆర్ఆర్ కు 60 కిలో మీటర్ల దూరంలో పెట్టాలన్నారు. రైతులను బికారీలను చేస్తామంటే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రైతుల పక్షాన ఎంతవరకైనా వచ్చి కొట్లాడుతామన్నారు.

ప్రభుత్వం మాటలు నమ్మొద్దు:

బీజేపీ పార్టీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని తాము మూసీ ప్రాజెక్టును అడ్డుకోవడం లేదని ఈటల స్పష్టం చేశారు. మూసీ కంపుని కడగండి, వరదలు రాకుండా చూడండి అంతే కానీ పేద ప్రజల భూములు లాక్కుని కార్పొరేటర్లకు ఇచ్చి దందా చేయించవద్దన్నారు. హుస్సేన్ సాగర్ పక్కన జలవిహార్, ఐమ్యాక్స్ పెద్దపెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారని అదే తరహాలో మూసీ ప్రక్షాళన ఉండవద్దని తాము కోరుతున్నామన్నారు. నల్లగొండ మూసీలో స్వచ్చమైన నీరు పారాలని మేమూ కోరుకుంటున్నామని అయితే నల్లగొండ ప్రజలు ప్రభుత్వం చెప్పే నంగనాచి మాటాలు నమ్మవద్దన్నారు. నల్లగొండ ప్రజలు గొప్పగా ఉండాలని తాము కోరుకుంటామని, వారికి ఈ మూసీ కంపు ఉండవద్దని ఆశీస్తున్నామన్నారు.

Next Story

Most Viewed